ఇప్పుడు అంతా కలిపి సినిమా రెండోసారి మూడోసారి చూస్తున్న ట్రెండ్ నడుస్తోంది. కల్కి సినిమా మొత్తం కాశీ నగరానికి ,, శంభళ నగరానికి మధ్యలో నడుస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ గురించి అందరికీ తెలుసు కానీ ఈ శంభళ నగరం ఎక్కడ ఉంది వెళ్లాలంటే సాధ్యం అవుతుందా అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శంభళ నగరం గురించి గతంలో మన పురాణాల్లో కొంత ప్రస్తావన ఉంది. రామాయణ కాలంలో బాల రాముడిని తీసుకుని విశ్వామిత్రుడు అడవుల్లోకి వెళతాడు. అయోధ్య నుంచి బయలుదేరి ఉత్తర దిశగా వెళ్లి అక్కడ ఉన్న సిద్ధాశ్రమం దగ్గర ధ్యానం చేసుకున్నట్లు చెబుతారు. ఈ సిద్ధాశ్రమమే తరవాత కాలంలో శంభళ నగరంగా మారింది. మహాభారత కాలంలో పాండవులు కూడా ఈ శంభళ నగరాన్ని దర్శించినట్లు చెబుతారు. ఆ కాలంలో అక్కడ పెద్ద ఎత్తున ఋషులు మునులు యజ్ఞ యాగాలు నిర్వహించినట్లు ప్రస్తావన ఉన్నది.
అసలు శంభళ నగరానికి ఇంతటి ప్రాధాన్యత రావడానికి కారణం ఇప్పుడు చూద్దాం. శంభళ నగరం హిమాలయాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్నది. ఇప్పుడు అక్కడ మానవ సంచారం లేనేలేదు. భారత్, టిబేట్, చైనా సరిహద్దులలో కైలాస పర్వతం నెలకొని ఉన్నది అని చెబుతారు. అదే ప్రాంతంలో పవిత్రమైన మానస సరోవరం కూడా కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే శంభళ నగరం ఉండేది. ఒకప్పుడు ఇది ఒక పల్లెటూరు. కానీ అక్కడ దివ్యపురుషుల రాకతో సంపన్న నగరంగా మారిపోయింది. తర్వాత కాలంలో ఆ నగరం మీద దుర్మార్గుల కన్ను పడటంతో.. విదేశీ రాజుల దురాక్రమణకు గురయ్యే అవకాశం ఉండడంతో.. దాన్ని ఇతర ప్రపంచంతో దూరం చేసుకున్నట్లు చెబుతున్నారు.
బౌద్ధ పురాణాలలో ఈ నగరం గురించి వర్ణన ఉన్నది. భారతీయ పురాణాలలో సిద్ధాశ్రమంగా చెబుతున్నా ఈ నగరాన్ని బౌద్ధులు షాంగ్రిల్లా అని పిలుస్తున్నారు. విదేశీ దండయాత్రలకు దూరంగా ఉంచేందుకు శంభళ నగరం.. ఇతర ప్రపంచం నుంచి దూరమైనట్లు బౌద్ధ పురాణాలు చెబుతున్నాయి.
ఇక్కడే మరో విషయం కూడా గమనించాలి. అప్పట్లో ముస్లిం రాజులు దండయాత్ర చేసినప్పుడు సంపన్న నగరాల మీద పడి దోచుకునేవారు. అయోధ్య, ,కాశీ, మధుర వంటి పుణ్యక్షేత్రాల్లో ఆలయాల రూపురేఖలు కూడా మార్చేశారు. దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేశారు. సంపదను పూర్తిగా దోచుకుని పోయారు. మహిళలు పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఈ సంగతి తెలుసుకున్న అప్పటి శంభళ నగరం పాలకులు ముందుగానే జాగ్రత్త పడ్డారు అని తెలుస్తుంది. హిమాలయాల మధ్యలో ఉన్న నగరం కాబట్టి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్నారు. అక్కడికక్కడే పంటలు పండించుకుని ఆహారాన్ని తింటూ తమదైన జీవితం కొనసాగిస్తున్నారు అని కథలు ప్రచారంలో ఉన్నాయి.
. హిమాలయాల్లో కైలాస కొండలకు దగ్గరగా ఇది ఉంది అని తెలుసు కానీ ఎక్కడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. హిమాలయాలు మీద పరిశోధనలు చేసిన మేడం బ్లావెట్ స్కీ .. ఈ శంభళ నగరం గురించి ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. హిమాలయాల మధ్యలో ఉత్కృష్ట నగరంగా అది నిలిచి ఉంది అని ఆమె పేర్కొన్నారు. కైలాస కొండకు సమీపంలో ఉండడంతో ఆ ప్రాంతానికి దివ్యమైన శక్తులు ఉన్నాయి అని ఆమె ఉదహరించారు. తర్వాత కాలంలో ఆ నగరాన్ని కనుక్కునేందుకు కొంతమంది ప్రయత్నించారు కానీ విఫలం అయ్యారు. తమిళనాడులోని కుర్తాళం పీఠాధిపతి మౌని స్వామి వారు హిమాలయాల్లో పర్యటించినప్పుడు ఆ శంభళ నగరాన్ని దర్శించినట్లు చెబుతున్నారు. అక్కడ తపస్సు చేసుకున్నప్పుడు దివ్యమైన అనుభూతి కలిగింది అని ఆయన పేర్కొన్నారు.
ఈ వివరాల్ని బట్టి చూస్తే కనుక శంభళ నగరం హిమాలయాల్లోనే ఉంది అయోధ్య వారణాసికి దగ్గరలో ఉంది అన్న విషయం అర్థం అవుతుంది. భారతదేశానికి ఆపద వచ్చినప్పుడు మాత్రం ఆ నగరం నుంచి రక్షణ కలుగుతుంది అని స్థానికులు భావిస్తున్నారు. ఆధునిక కాలంలో అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
కొంతకాలం తర్వాత అయినా పరిశోధకులు ఈ శంభళ నగరం పూర్తి వివరాలు మనకు అందిస్తారని ఆశిద్దాం.