IRCTC ద్వారా రిలీజియస్ టూరిజం ప్రోత్సహించడానికి “దేఖో అప్నా దేశ్” కార్యక్రమం కింద దేశంలో ముఖ్యమైన మత పరమైన యాత్రా స్థలాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ IRCTC వివిధ రకాల ప్రత్యేక రైళ్లను, సర్క్యూట్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో భాగంగా అటువంటి మొట్ట మొదటి ప్రత్యేక యాత్రా స్పెషల్ ట్రైన్
“శ్రీ రామాయణ యాత్ర” అనే ట్రైన్ ప్రారంభించింది.
ఈ యాత్ర రామాయణంతో సంబంధం ఉన్న ముఖ్య ప్రదేశాలను చూపెడుతుంది. ఈ ట్రైన్ తన మొదటి యాత్రను మొన్న ఆదివారం ఢిల్లీ నుండి ప్రారంభించింది.
ఈ ట్రైన్ మొదట ప్రకటించినపుడు ప్రజల స్పందన ఎలా ఉంటుందో అని అనుమాన పడ్డారు. అయితే వీరు ఊహించిన దాని కన్నా గొప్ప స్పందన వచ్చి ట్రైన్ ప్రకటించిన కొద్దీ రోజుల్లోనే మొత్తము టికెట్లు బుక్ అయిపోయాయి.
ఈ డీలక్స్ AC టూరిస్ట్ రైలు నవంబర్ 07న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి 16 రాత్రులు మరియు 17 పగళ్లు ప్రయాణం చేస్తుంది. దీనిలో మొత్తం 132 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు.
ఈ రైలు అయోధ్య, నందిగ్రామ్, జనకపూర్, సీతామరహి, కాశీ, ప్రయాగ, శృంగవేర్పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం సహా రాముడు పాదం మోపిన ముఖ్య ప్రదేశాలను చూపెడుతుంది.
శ్రీరాముని జన్మస్థలం అయోధ్యతో ప్రయాణం ప్రారంభమవుతుంది, ఇక్కడ పర్యాటకులు శ్రీరామ జన్మభూమి దేవాలయం మరియు హనుమాన్ దేవాలయాన్ని సందర్శిస్తారు, తర్వాత శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు అయోధ్యను పరిపాలించిన ప్రదేశం నందిగ్రామ్‌లోని భారత మందిరాన్ని సందర్శిస్తారు.
తరువాత బీహార్‌లోని సీతామర్హి లో యాత్రికులు సీతమ్మ వారి జన్మస్థలం మరియు జనక్‌పూర్‌లోని రామ్-జాంకీ ఆలయానికి తీసుకువెళతారు. ఇది రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఉంటుంది.
దీని తరువాత, రైలు వారణాసి వైపు వెళుతుంది, ఇక్కడ పర్యాటకులు రోడ్డు మార్గంలో వారణాసి, ప్రయాగ్, శృంగ్వేర్పూర్ మరియు చిత్రకూట్ దేవాలయాలను సందర్శిస్తారు. షెడ్యూల్ ప్రకారం, వారణాసి, ప్రయాగ్ మరియు చిత్రకూట్లలో రాత్రి హాల్ట్ ఉంటుంది. యాత్ర తరువాత మహారాష్ట్రలోని నాసిక్ (త్రయంబకేశ్వరాలయం)కి వెళ్లి పంచవటి వెళ్తుంది.
చివరి గమ్యస్థానం అయిన రామేశ్వరం చేరుకోవడానికి ముందు, యాత్ర హంపిలోని హనుమంతుని జన్మస్థలం- కిష్కింద అని పిలువబడే పురాతన నగరం చేరుకుంటుంది. ప్రయాణీకులు ఈ మొత్తం ప్రయాణంలో దాదాపు 7500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తారు.
ఈ రైలులో రెండు కేటగిరీలు ఉన్నాయి. ప్రయాణికులు – 2AC కోసం -రూ. 83,000, 1AC కోసం రూ. 1.02 లక్షలు చెల్లించాలి.
ఈ ప్యాకేజిలో ప్రయాణికులకు ట్రైన్ లో AC ప్రయాణం, స్థానిక రోడ్డు ప్రయణాలలో AC ప్రయాణం, హోటల్ లలో బస మరియు శాకాహార భోజనం ఏర్పాట్లు ఉన్నాయి.
భద్రత కోసం రైలులో సిసిటివిలను ఏర్పాటు చేసిన ప్రత్యేక లాకర్లను కూడా ఏర్పాటుచేశారు రైలులో భోజనాలు చేయడానికి వీలుగా రెండు ప్రత్యేక కోచ్‌లలో డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు.
ఇదే ప్యాకేజీతో రామాయణ్ సర్క్యూట్లో తదుపరి పర్యటన డిసెంబర్ 12న ప్రారంభించబడుతతుంది.
రామాయణ యాత్ర అనేది IRCTC యొక్క సీనియర్ అధికారి అచ్యుత్ సింగ్ యొక్క ఆలోచన, అతనే ఈ ప్రత్యేక రైలు ఇన్చార్జి కూడా నియమించబడ్డారు.
‘శ్రీ రామాయణ యాత్ర’ తర్వాత, IRCTC నవంబర్ 27న ప్రారంభం కావాల్సిన ప్రత్యేక ‘రాంపత్ యాత్ర ‘ రైలును ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రామాయణ యాత్ర మొదటిది అయితే, శ్రీ రామాయణ యాత్ర టూర్స్ క్రింద వివిధ ప్యాకేజీలతో ఇతర రైళ్లను కూడా ప్లాన్ చేస్తున్నాం ఇవి త్వరలో ప్రారంభించబడతాయని IRCTC చెప్పింది.
Courtesy : … శాస్త్రి…..