ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL-15 సీజన్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ సీజన్లో టోర్నమెంట్లో చేరిన రెండు కొత్త జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి తొలి ట్రోఫీని గెలుచుకుంది. రాయల్స్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ, ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లను గెలుచుకున్నారు. లీగ్‌లో అడుగుపెట్టిన తొలిసారే ప్రత్యర్థులను వణికించడంతో పాటు.. హోరాహోరీ తప్పదనుకున్న ఫైనల్‌ను కాస్తా గుజరాత్ జట్టు ఏకపక్షంగా మార్చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఒత్తిడిని దరి చేరనీయకుండా బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణించాడు. గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. మిల్లర్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్) చివర్లో వేగంగా ఆడాడు. బౌల్ట్, ప్రసిద్ధ్, చాహల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా హార్దిక్ నిలిచాడు.
హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, శుభమన్ గిల్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, రాహుల్ తెవాటియా, వృద్ధిమాన్ సాహా.. వీళ్లందరినీ ఐపీఎల్‌లోని టాప్ జట్లు మాకు వద్దని వేలంలోకి వదిలేశాయి. కానీ.. ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ టీమ్ టైటిల్ విజేతగా నిలవడంలో వీరందరూ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ జట్టులో ఒక్కో మ్యాచ్‌లో.. ఒక్కో ప్లేయర్ జట్టుని గెలిపిస్తూ హీరోగా మారుతూ వచ్చారు. ఎంతలా అంటే? ఆ టీమ్‌లోని దాదాపు ముప్పావు శాతం మంది ఆటగాళ్లకి సీజన్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు దక్కాయి. మరే జట్టులో కూడా ఇలా అందరూ ఆటగాళ్లు సమష్టిగా రాణించిన దాఖలాలు లేవు. వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కచ్చితంగా కోచింగ్ స్టాఫ్ గ్యారీ కిరెస్టెన్, ఆశిష్ నెహ్రాకే దక్కుతుంది.