తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇన్ స్టా గ్రామ్ రీల్ ను హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ ప్రసారం చేసిందని..సదరు సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అసలు పటిష్ట భద్రత నడుమ ఉండే ఆలయంపై డ్రోన్ తో చిత్రీకరించే అవకాశం లేదని ఆయన అన్నారు. పాత చిత్రాలతో యానిమేట్ చేసిఉంటారా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్టు వైవీ తెలిపారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటివి ఎగరడానికి వీల్లేదు. నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమలలో ఇలా డ్రోన్ తిరగడంపై విమర్శలు వస్తున్నాయి. భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారు.