శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ వేగంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు నిరంతర కృషితో అనేక అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చారు.
రూ. 130 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రథాన వైజ్ఞానిక పరిశోధనకు దోహదంచేసేలా పుణె, ఢిల్లీ, కోల్కతాలలో మోహరించారు. వాతావరణ, పర్యావరణ పరిశోధనకు అనుకూలంగా రూపొందించిన రూ. 850 కోట్ల ‘హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్పిసి) వ్యవస్థ కూడా అందుబాటులో కి వచ్చింది.
కుంభవృష్టి, వేడి గాలు లు, తుఫాన్లు, భారీ వర్షం, వడగండ్ల వాన, కరువు పరిస్థితుల్ని అంచనా వేసేందుకు పుణె, నోయిడాల్లో అత్యంత శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలను తీసుకొచ్చారు.
ఈ వ్యవస్థల సహాయంతో వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. వేగవంతమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయడం సాధ్యమవుతుంది.
ఈ వ్యవస్థలను వీడియో లింక్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో భారత్ అగ్ర పథాన నడుస్తోంది అని గుర్తు చేశారు. శాస్త్రవేత్తలు పరిశోధకులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన వివరించారు.