తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. మే డ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి.. సభకు సంబంధించిన అంశాలను వదిలిపెట్టి పదేపదే టీఆర్ఎస్ పథకాలను, సీఎం కేసీఆర్ను ప్రస్తావించడంపై సభకుహాజరైనవాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్..’అంటూ నినాదాలు చేశారు. ఇందుకు ఆగ్రహించిన మంత్రి.. మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన వాహనంపై కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. పోలీసులు కష్టమ్మీద వారిని అడ్డుతప్పించి మల్లారెడ్డిని బయటికి తరలించారు.
2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. అయితే ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మాత్రమే ఏకరవు పెట్టారు. అయితే రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న రెడ్డి కార్పొరేషన్ ఏమైందని సభికులు ఆయనను ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానమిస్తూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు కార్పొరేషన్లు, భవనాలు ఇస్తున్నారని, దళితులకు దళిత బంధు ఇస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకంటూ మంత్రి ప్రసంగానికి పలువురు అడ్డు తగిలారు. దీంతో ‘‘మా ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోవద్దా..’’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్పై ప్రశంసలు మొదలుపెట్టారు. దీనిపై అక్కడున్నవారు మరింతగా ఆగ్రహంతో ఊగిపోయారు. కుర్చీలు, చెప్పులు పైకెత్తి నిరసన తెలిపారు. దళితబంధు గురించి ఇక్కడెందుకు అంటూ జేఏసీ నాయకులు వేదికపైనే మంత్రిని చుట్టుముట్టి ప్రశ్నించారు.
దాడిపై చాలా సీరియస్ అయ్యారు మంత్రి. రేవంత్ రెడ్డే తనపై దాడి చేయించారని మండిపడ్డారు. ఏ ఒక్కరినీ వదలబోనని హెచ్చరించారు.