చాలా దేశాల కన్నాభారత ఆర్థిక వ్యవస్థ బాగుందని ఐఎంఎఫ్ తెలిపింది. చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో సాగుతుంటే… భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కృష్ణశ్రీనివాసన్ తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధి నెమ్మదిస్తోందని… అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు ఆర్థిక వ్యవస్థ గల దేశాలు ఈ ఏడాది కానీ, వచ్చే సంవత్సరం కానీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్తాయని అంచనావేస్తున్నట్టు చెప్పారు. ఇటీవలే విడుదల చేసిన నివేదికలో 2022లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను సవరించింది ఐఎంఎఫ్. ఈ రేటు 6.1 శాతం ఉంటుందని చెప్పింది. జూలైలో విడుదల చేసిన నివేదికలో ఈ రేటు 7.4 శాతం అని జోస్యం చెప్పింది. ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా భారత దేశ అంచనా వృద్ధి రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారత దేశ వృద్ధి వేగంగా ఉంటుందని అంచనా వేశాయి. భారత దేశం తర్వాతి స్థానాల్లో చైనా (4.4 శాతం), సౌదీ అరేబియా (3.7 శాతం), నైజీరియా (3 శాతం) ఉన్నాయి.