రష్యాతో వాణిజ్య సంబంధాలపై నార్త్ అంట్టాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్( NATO) చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఘాటుగా స్పందించింది. నాటో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే సుంకాలు విధిస్తామని నాటో చీఫ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. దేశ ప్రజల ఇంధన అవసరాలు తీర్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ‘నాటో చీఫ్ వ్యాఖ్యలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అవకాశాలను, ప్రపంచ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం’ అని జైశ్వాల్ తెలిపారు. ‘ద్వంద్వ ప్రమాణాల’ విషయంలో జాగ్రత్తగా ఉంటామని ఆయన అన్నారు. మరోవైపు ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ పేర్కొన్నారు.