అమెరికా సుంకాల బెదిరింపుల మీద చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా దీని మీద రకరకాల వాదనలు నడుస్తున్నాయి. ఇందులో చాలా వరకు గాలి కబుర్లు ఉంటున్నాయి. ఇక్కడ కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. భారత్ మీద అమెరికా చేస్తున్నవి ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే.
భారత్ నుంచి జాలి పడి అమెరికా సహా ప్రపంచదేశాలు దిగుమతులు చేసుకోవడం లేదు. వారికి అవసరం అయితేనే మన దేశం నుంచి వస్తువులు కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు.. భారత్ ఎగుమతులపై ఎలాంటి బెంగ అవసరం లేదని ప్రధాని మోదీ చెబుతున్నారు. బెదిరింపులకు తలొగ్గే రోజులు పోయాయని ఎర్రకోట నుంచి నినదించారు.
ఇక్కడ ఒక తేడా గమనించాలి. ప్రపంచంలో చైనాకు ఓ బ్రాండ్ ఉంది. అదేమిటంటే డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తుందని. నాసిరకం వస్తువుల్ని ప్రపంంచ మీదకు వదులుతుందని. అదే భారత్ కు ప్రపంచ స్థాయిలో ఉన్న బ్రాండ్ వేరు. ప్రాణాలు నిలిపే ఫార్మా దగ్గర నుంచి అత్యుత్తమ నాణ్యతతో కూడా సాఫ్ట్ వేర్ ఎగుమతుల వరకూ భారత్ అన్ని రంగాల్లోనూ తక్కువ ధర – అధిక నాణ్యత బ్రాండుతో దూసుకెళ్తున్నాయి.
అసలు విషయం మరొకటి ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం భారత మార్కెట్ పై కన్నేసి అమెరికా వస్తువుల్ని భారత్ లో కి డంపింగ్ చేసి భారత ఆర్థిక వ్యవస్థ మీద కన్నేసే సుంకాలు విధించారు. అమెరికాలో ఆవులకు మాంసాహారం పెడతారు. వాటి నుంచి వచ్చే పాలను మాంసాహార పాలు అంటారు. వాటిని ఇండియాలోకి డంపింగ్ చేద్దామనుకున్నారు. అది కూడా పన్నులు లేకుండా. కానీ ఇండియా అంగీకరించలేదు. భారీగా పన్నులు విధించినా సరే అలాంటి వాటికి ఇండియాలో చోటు లేదని తేల్చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధార పడి ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా టారిఫ్‌లు వేస్తున్నారు. అవసరం లేని వస్తువుల్ని ఓ దేశంపై ప్రేమతో ఎవరూ దిగుమతి చేసుకోరు. అమెరికా లాంటి స్వార్థపూరిత దేశం అసలు చేసుకోలేదు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు అక్కడి ప్రజల అవసరాల్ని తీరుస్తుంది. అంతే కానీ భారత్ ను బతికించడానికి దిగుమతి చేసుకోవడం లేదు.
గతంలోకి వెళితే..
భారత్ పై సుంకాలు విధించడం, ఆంక్షలు విధించడం అమెరికాకు మొదటి సారి కాదు. భారత్ తన భద్రత కోసం అణుపరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అమెరికా ఆంక్షలు విధించింది. 1998లో భారత్ పోక్రాన్-II అణు పరీక్షలు చేసిన తర్వాత, అమెరికాలోని క్లింటన్ ప్రభుత్వం భారత్‌పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. అమెరికా చట్టం ప్రకారం కొత్త రుణాలు, రక్షణ, డ్యూయల్-యూజ్ టెక్నాలజీల వాణిజ్యం ఆపేశారు. టారిఫ్‌ల కంటే తీవ్రమైన ఆర్థిక, వాణిజ్య పరిమితులు విధించారు.
2001–2002 జార్జి బుష్ ప్రభుత్వం స్టీల్ టారిఫ్‌లు 8% నుంచి 30% వరకు విధించింది. అయినా భారత్ ఎక్కడా తల వంచింది లేదు. అదే సమయంలో ఆ ఆంక్షలు కానీ..టారిఫ్‌లు కానీ భారత్ ను ఆర్థికంగా దెబ్బతీసింది కూడా లేదు. అదే సమయంలో అమెరికా మనపై ఆధారపడింది కూడా. ఐటి, సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా 1998–2004 కాలంలో అమెరికా ఐటీ దిగ్గజ కంపెనీలు యాక్సెంచర్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా కంపెనీలు కూడా భారతీయ టాలెంట్, ఔట్‌సోర్సింగ్‌ను వదల్లేదు. అప్పటితే పోలిస్తే ఇప్పుడు ఇంకా భారత్ పై ఆధారపడటం పెరిగింది.
మొత్తం మీద ఇప్పుడు.. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా దృష్టి సారించారు. ఇది ఒక శుభ పరిణామం.