బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా అనేక సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. బంగ్లాదేశ్ లో శాంతి నెలకొనాలని భారతదేశం అంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లో హింసకాండ ప్రభావం ఈశాన్య రాష్ట్రాల మీద కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మీద ఒత్తిడి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడిందని పార్లమెంటులో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వ్రాతపూర్వక సమాధానంలో తెలిపారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి షేక్ హసీనా పదవీచ్యుత తర్వాత జరిగిన పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలిపారు. జైల్లో ఉన్న ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ దాస్‌కు బంగ్లాదేశ్ కోర్టులు న్యాయం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ఇస్కాన్ గురువు చిన్మయి కృష్ణ దాస్ అరెస్టు మీద సర్వత్ర ఆందోళన వినిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను తక్షణమే ఆపాలని, ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ దాస్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆర్ఎస్ఎస్ సర్ కార్యావాహ దత్తాత్రేయ హోసబాలే ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హిందువులకు రక్షణ కల్పించేలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రపంచ అభిప్రాయాన్ని రేకెత్తించాలని హోసబాలే భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అనేక నగరాలలో పట్టణాలలో స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లు, ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
ఈ సమస్య పొరుగు దేశానికి సంబంధించినది కాబట్టి, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దౌత్య మార్గాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం ఈశాన్య రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు సున్నితమైన ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యల మీద కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాలు అన్వేషిస్తున్నది.