జమ్ము కాశ్మీర్ లోని కాంగ్రెస్ .. నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిలో కుంపటి రగులుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పెద్దగా సయోధ్య కనిపించటం లేదు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాల కూటమి గా ఉన్న ఇండీ కూటమిలో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పరిమితంగానే పాత్ర పోషిస్తోంది. దీనిని బట్టి ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి అన్న మాట వినిపిస్తోంది.
వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పొత్తులో పోటీ చేసాయి. కాంగ్రెస్ 38 స్థానాల్లో పోటీ చేసి 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 56 సీట్లలో పోటీ చేసి 42 స్థానాల్లో విజయం సాధించింది. పొత్తులో మూడో పార్టీ అయిన సీపీఎం కి ఒకటే సీటు దక్కింది. మొత్తం గా చెప్పాలంటే కాంగ్రెస్, సీపీఎం గెలుపులో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దే కీలక పాత్ర.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విచిత్రంగా వచ్చాయి. మొత్తంగా జమ్మూకశ్మీర్ శాసనసభలో 90 స్థానాలు ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించడానికి కేవలం 4 సీట్ల దూరంలో ఆగిపోయింది. నిజానికి కాంగ్రెస్తో పొత్తులో ఉన్నప్పటికీ వారిమధ్య సఖ్యత సరిగ్గా కుదరలేదు. కాంగ్రెస్ తన శక్తికి మించిన స్థానాల్లో పోటీ చేసింది. వాటిలోనూ బలమైన పోటీ ఇవ్వలేకపోయింది. విచిత్రం ఏంటంటే, 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ పొత్తు పక్షం నేషనల్ కాన్ఫరెన్స్ మీద కూడా పోటీ చేసింది. ఆ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ శైలిపై ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాతా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
కాంగ్రెస్ చేసిన చీప్ రాజకీయాల మీద తండ్రీ కొడుకులు ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా లకు బాగా కోపం వచ్చింది. అందుకే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ను ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఆ పార్టీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఇప్పుడు కూడా ఎన్సీ పార్టీ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాల వైఖరి కాంగ్రెస్ పట్ల మరింత కఠినంగా మారింది. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వ్యవహార శైలి కూడా దానికి కొంత కారణమే అని చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ఇండీ కూటమిగా పోటీ చేసాయి. కాంగ్రెస్ జమ్మూ ప్రాంతంలోని 2 స్థానాల్లో తన అభ్యర్ధులను నిలిపింది. కానీ కశ్మీర్ లోయ ప్రాంతంలోని 3 సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ స్నేహపూర్వకంగా పోటీ పడ్డాయి. అయితే ఇండీ కూటమికి నాయకుడిగా వ్యవహరించిన కాంగ్రెస్, తన రెండు మిత్రపక్షాల మధ్యా సయోధ్య కుదర్చలేదు, పరస్పర పోటీకి దిగకుండా నిలువరించలేదు. అప్పటినుంచే ఒమర్ అబ్దుల్లాకు, అతని పార్టీకి కాంగ్రెస్ మీద అసంతృప్తి మొదలైందని చెప్పవచ్చు.
ఇక్కడే మరో విషయం కూడా గమనించాలి. ఈవీఎంల వినియోగం మీద కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నప్పుడు వారిని ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా విమర్శించాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల సాయంతోనే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని, ఆ సందర్భంగా ఆ పార్టీ సంబరాలు కూడా చేసుకుందని గుర్తు చేసాడు. అదే అసెంబ్లీ ఎన్నికలు, ఉపయెన్నికల్లో తాము సరిగ్గా రాణించలేకపోవడానికి ఈవీఎంలను నిందించడం సరికాదంటూ అభ్యంతరం చెప్పాడు. ఎందుకంటే.. ఈవీఎమ్ లను నిందిస్తే జమ్ము కాశ్మీర్ లో తమ గెలుపు మీద అనుమానాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ని వదిలించుకొనేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రయత్నిస్తోంది అన్న మాట నిజం. అందుకు తగినట్లుగానే పార్లమెంటు వ్యవహారాల్లో కూడా కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది.