మరోసారి పాకిస్తాన్ సిగ్గుపోయింది. ఆ దేశ దౌత్య కార్యాలయమే తీవ్రంగా అవమానించింది. సెర్బియా ఎంబసీ తన అధికారిక హ్యాండిల్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ ను నిలదీస్తూ ట్వీట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను తప్పుబడుతూ ఆ ట్వీట్ ఉన్నా.. వాళ్ల దయనీయ స్థితి బయటపడింది. మూడేళ్లుగా జీతాలు ఇవ్వలేదని, తమ పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని అందులో పేర్కొంది. ఇలాగే తాము మౌనంగా పనిచేసుకుంటూ పోవాలని ఇమ్రాన్ అనుకుంటున్నాడని..ఇదేనా తాను చెప్పిన నయా పాకిస్తాన్ అని ఎంబసీ ట్విట్టర్ వేదిగ్గా నిలదీసింది.
పాకిస్తాన్ కొంత కాలంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలుసు. అయితే సాక్షాత్తూ విదేశీ ఎంబసీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఇమ్రాన్ పై విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. కనీసం తన దౌత్యాధికారులకూ వేతనాలు ఇవ్వలేని పరిస్థితిని ట్వీట్ ద్వారా బయటపడింది. దీన్ని బట్టి ఇమ్రాన్ ప్రభుత్వంపై ఉన్నతాధికారుల్లో ఎంత అసంతృప్తి ఉందో అర్థం అవుతోంది.
ఇవాళ ఉదయం 11:26 గంటలకు పోస్ట్ అయిన ఆ ట్వీట్లో…దేశంలో ద్రవ్యోల్బణం గత రికార్డులన్నింటినీ చెరిపేస్తున్నదని ఎంబసీ మండిపడింది. ‘మమ్మల్ని ఇంకా ఎంత కాలం మౌనంగా పని చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేదని మా పిల్లలను స్కూల్ నుంచి బయటకు గెంటేస్తున్నారు. అయినా ఇంకా ఎంత కాలం నోరుమూసుకోవాలనుకుంటున్నారు. ఇదేనా నయా పాకిస్తాన్ అంటే?’ అంటూ ట్వీట్ చేసింది.
‘మీరు ఆందోళన చెందవద్దు’ అంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను వ్యంగ్యంగా చూపిస్తూ…విమర్శిస్తున్నట్టుగా ఉన్న వీడియోనూ ట్వీట్ కు జతచేశారు. నిత్యావసర సరుకులు, మందుల ధరలు విపరీతంగా పెరిగాయని…. ఇమ్రాన్ ప్రభుత్వం దేశాన్ని అదః పాతాలానికి తీసుకెళ్తోందని ఆ వీడియో సారాంశం. వెంటనే మరో ట్వీట్ చేస్తూ…సారీ ఇమ్రాన్ మాకు మరో మార్గం లేకపోయింది అనే అర్థం వచ్చేలా పోస్టు చేశారు. సెర్బియాలోని పాక్ ఎంబసీ చేసిన ఈ
ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. సొంత అధికారులు తిరుగుబాటు చేయడం కలకలం రేపుతోంది. దీంతో పాక్ ప్రభుత్వం సర్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇమ్రాన్ డిజిటల్ మీడియా కీలక అధికారి డాక్టర్ ఆర్సలాన్ ఖాలిద్ స్పందిస్తూ ట్విట్టర్ ఖాతా హ్యాకైందని…దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు.