తిరువణ్ణామలైలోని అరుణాచలం ఇటీవల తెలుగు భక్తులకి అత్యంత ప్రాశస్త్యమైన పుణ్యక్షేత్రంగా మారింది. రోజుకు వేలాదిగా భక్తులు అక్కడికి చేరుకుంటూ, ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసం, దీపోత్సవం సమయంలో అరుణాచలం ప్రాంతం ఆధ్యాత్మిక జ్వాలలతో కాంతిమంతమవుతుంది.
….
ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే భరణీ దీపం ను సాంప్రదాయ పద్దతిలో వెలిగించారు. దాదాపు వారం పది రోజుల పాటు ఇది నిరంతరాయంగా మండుతూ ఉంటుంది. ప్రస్తుతం వెలిగిన ‘భరణీ దీపం’ అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సూచకం. అన్నామలై గిరిపై వెలిగే ఈ మహా దీపం జ్యోతి స్వరూపుడైన అగ్నిలింగాన్ని గుర్తు చేస్తుంది. . దీపం వెలిగిన క్షణం నుండి పట్టణం మొత్తం భక్తి జ్వాలలతో నిండిపోతుంది. ఆ భరణీ దీపాన్ని ప్రత్యక్షంగా చూడటమే జీవితంలో గొప్ప పుణ్యఫలమని భక్తులు భావిస్తారు.
…………………………….
ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక ఇది. దీపోత్సవం సందర్బంగా అరుణాచలం కిక్కిరిసిపోతోంది. 2 వేలకు దొరికే అకామడేషన్ 20వేలు పెట్టినా దొరకని పరిస్థితి. టౌన్ తో పాటు చుట్టుపక్కల 5,6 కిలోమీటర్ల దాకా జన ప్రవాహమే. అరుణాచలం అంటే గుర్తు వచ్చేది గిరి ప్రదక్షిణం. అరుణాచలం గిరిని ప్రదక్షిణం చేయడం ఎంతో పవిత్రమైన ఆచారం. 14 కిలోమీటర్ల పాదయాత్ర భక్తులకు శాంతి, ధైర్యం, అనుభూతి అన్నీ కలిపిన ఆధ్యాత్మిక ప్రయాణంలా ఉంటుంది. భరణీ దీపం సందర్బంగా గిరి ప్రదక్షిణ మార్గం అంతా కిక్కిరిసిపోతోంది.
………….
ఇటీవలి సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. నమ్మకం, అనుభవం, ఆధ్యాత్మిక ప్రశాంతత — ఈ మూడు కారణాలు తెలుగు భక్తులను అక్కడికి ఆకర్షిస్తున్నాయి. భరణీ దీపం సందర్భంగా కూడా అత్యధిక శాతం తెలుగు భక్తులే ఉండటం మరో విశేషం.


