ఉడిపిలో కాలేజీలో హిజాబ్ గొడవ అలా సద్దుమణిగిందో లేదో కుందాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మళ్లీ వివాదం మొదలైంది. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంపై హిందూ అబ్బాయిలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… 100 మంది హిందూ విద్యార్థులు మెడలో కాషాయ కండువాలతో కాలేజీకి వచ్చారు.
కాలేజీలో చదువుతున్న 27 మంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీకి వస్తుండడంపై ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హిజాబ్ లు తొలగించమని కోరగా వారు నిరాకరించారు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఇతర విద్యార్థుల నిరసనలతో కాలేజీ సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకనుంచి విద్యార్థినులెవరూ హిజాబ్ ధరించి కాలేజీకి రావద్దంది. కాలేజీ అధ్యాపకులు చెప్పినా వారు వినలేదు. దీంతో అబ్బాయిలు కాషాయ కండువాలు ధరించి కాలేజీకి వచ్చారు.
దీంతో ఇది వివాదానికి దారితీసింది. కుందాపూర్ ఎమ్మెల్యే హలాది శ్రీనివాస్ శెట్టి, పాఠశాల యాజమాన్యం …ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.హిజాబ్ లేకుండా పిల్లల్ని పంపాలని కోరగా బాలికల తల్లిదండ్రులు నిరాకరించారు. తమ పిల్లలకు కళాశాలలో హిజాబ్ ధరించే హక్కు ఉందని, విద్యాసంస్థల్లో మతాన్ని తీసుకురావడం సరికాదని వారన్నారు. హిజాబ్ తప్పనిసరి అని ప్రిన్సిపాల్‌ని రాతపూర్వకంగా ఇస్తే… వాళ్లని పంపాలా వద్దా అనేది తాము నిర్ణయించుకుంటామని తెగేసి చెప్పారు. అయితే ముస్లిం బాలికలు క్యాంపస్ లోకి హిజాబ్ తో వస్తే తాము కాషాయ కండువాలతో వస్తామనీ అక్కడే ఉన్న ఇతర విద్యార్థులూ చెప్పారు. ఎటూ తేలకుండానే సమావేశం ముగిసింది. అయితే విద్యార్థులెవరైనా సరే హిజాబులు, కండువాలతో వచ్చేవారిపై కఠిన చర్యలుంటాయని ఎమ్మెల్యేతో పాటు అధ్యాపకులూ చెప్పినట్టు తెలిసింది.
https://twitter.com/KeypadGuerilla/status/1488788016844128262?s=20&t=TgIHzcH9_Rr6LoiLbHKdEw
ఉడిపిలోని బాలికల ప్రీ-యూనివర్శిటీ కళాశాల విద్యార్థులు తరగతి గదిలో హిజాబ్ ధరించే హక్కును అనుమతించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాలేజీలోకి హిజాబ్ ధరించి రావద్దంటూ కాలేజీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే కాలేజీ నిర్ణయాన్ని ఎనిమిది మంది విద్యార్థులు తప్పుబట్టారు.
https://twitter.com/KeypadGuerilla/status/1488787984980004866?s=20&t=-hajahd6YPIxtGU3HlHIJA
విద్యార్థి హిజాబ్ ధరించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25 ప్రకారం వారి ప్రాథమిక హక్కు అని అది ఇస్లాం ఆచారంటూ కోర్టుకెళ్లారు. తమను హిజాబ్ తోనే తరగతులకు అనుమతించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇక మంగళవారం భద్రావతిలోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో కొంతమంది విద్యార్థులు హిజాబ్‌లు ధరించి తరగతులకు రావడంతో మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలతో క్లాసులకు వెళ్లారు.