వ్యాక్సిన్ వేసుకుంటే ఐస్ క్రీం ఫ్రీ
కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యావత్ ప్రపంచాన్ని ఓ రేంజ్లో వణికిస్తోంది. కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా.. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టడం పలు దేశాలకు తలనొప్పిగా మారింది. అందుకు కారణం వ్యాక్సిన్ వేసుకుంటే దుష్ప్రభావాలు ఎదురవుతాయన్న అనుమానాలు. క్లినికల్ ట్రయల్స్ అనంతరం కొందరికి ప్రతిచర్యలు ఏర్పడటం.. ఆ తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొందరు ఇతర కారణాలచేత ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల తీవ్ర భయాందోళనలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రష్యాలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అత్యంత నెమ్మదిగా జరుగుతోంది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అధికంగా సరఫరా అయిన ప్రాంతాల్లో మాస్కో ఒకటి. అయితే ఇక్కడ టీకాలు తీసుకున్న వారి సంఖ్య.. లండన్,న్యూయార్క్ వంటి నగరాల కంటే తక్కువగా ఉంది. ఇటీవల ఓ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం.. 38 శాతం మంది రష్యన్లు మాత్రమే స్పుత్నిక్ వీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని తేలింది. ఈ క్రమంలో ప్రభుత్వం టీకాలు వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. వారిని ఆకర్షించేందుకు పలు ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా అక్కడి ఫేమస్ స్వీట్ డీలర్తో రష్యా ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఓ ఐస్ క్రీంను ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.