వివాదాలు రాజేసి పేరు తెచ్చుకోవడం సినిమా తారలకు బాగా అలవాటు. ఇప్పుడు కొందరు ఐఏఎస్ అధికారులు కూడా ఇదే బాట పడుతున్నారు. కావాలని వివాదాలు రేకెత్తించి దాని ద్వారా క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఉత్తరాది రాష్ట్రాల ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి పేషీ లోని కార్యదర్శి హోదాలో ఆమె చక్రం తిప్పారు. అప్పట్లో కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ క్రేజ్ బాగానే సంపాదించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆమెను లూప్ లైన్ కు పంపించారు.
అయినప్పటికీ స్మిత సభర్వాల్ ఏమాత్రం తగ్గటం లేదు. సోషల్ మీడియా వేదికగా ఫాలోయింగ్ పెంచుకునేందుకు వీడియోలు రీల్సు వదులుతూనే ఉన్నారు. పనిలో పనిగా కొన్ని కాంట్రావెర్స్ స్టేట్మెంట్లు కూడా చేస్తున్నారు.
తాజాగా సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించడం మీద ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘ ఒక ఎయిర్ లైన్.. వైకల్యం ఉన్నవారని పైలట్‌గా తీసుకుంటందా ?, వైకల్యం ఉన్న ఒక సర్జన్‌ను మీరు నమ్ముతారా ?. ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఓఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. ప్రజల సమస్యలను వినాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫిజికల్ ఫిట్నెస్ అవసరమవుతుంది. ఇలాంటి ప్రీమియర్ సర్వీస్‌కి దివ్యాంగ కోటా ఎందుకు అవసరం’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే దివ్యాంగులు కలెక్టర్లుగా ఉన్నతాధికారులుగా రాణించలేరు అని స్మిత సబర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో దివ్యాంగుల కోటాలో సెలెక్ట్ అయిన ఒక ఐఏఎస్ అధికారి మీద వివాదం నడుస్తోంది. దీనిని సాకుగా చూపించి స్మిత సభర్వాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.
కానీ అదే సోషల్ మీడియా వేదికగా స్మిత సభర్వాల్ మీద అనేకమంది విరుచుకుపడుతున్నారు. ఐఏఎస్ అధికారులుగా రాణిస్తున్న దివ్యాంగుల విజయ గాథలను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. హైదరాబాదులో సివిల్స్ కోచింగ్ ఇచ్చే మాజీ బ్యూరోక్రాట్ బాలలత.. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. స్మితా సభర్వాల్ ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ‘ఆమె ట్వీట్ దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోంది. ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి. స్మితపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. లేదంటే ట్యాంక్ బండ్‌పై ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. స్మిత చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్‌లు స్పందించాలి. ఆమెకు ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఐఏఎస్ కి రాజీనామా చేస్తారా ?. ఆమె రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది’ . స్టీఫిన్ హాకింగ్, సుదా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారు.. అంగవైకల్యం ఉన్న జై పాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరీ సాధించారు..అంగవైకల్యంతో పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డులు తీసుకున్నవారువున్నారు అంటూ బాలలతా అన్నారు.
అంతేకాదు బాలలత మరో సవాల్ కూడా విసిరారు. ఇప్పటికిప్పుడు ఐఏఎస్ పరీక్ష పెట్టించాలని .. తాను స్మితా సభర్వాల్ ఒకేసారి పరీక్ష రాస్తామని.. ఎవరికీ ఎక్కువ మార్కులు వస్తాయో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు.
మరోవైపు ఇదంతా ఒక డ్రామా అన్న మాట కూడా వినిపిస్తోంది. ప్రజల అటెన్షన్ తన వైపు తిప్పుకునేందుకు స్మిత సభర్వాల్ కావాలనే ఇటువంటి వివాదాలు రాజేస్తున్నారు అని అంటున్నారు. కాంట్రావెర్సి చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడం స్మితకు మొదటి నుంచి అలవాటని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసం సినీ తారలు ప్రయత్నించడం చూసాము కానీ.. ఐఏఎస్ అధికారులు కూడా ఇటువంటి బాట పట్టడం కాస్త వింతగానే ఉంది.