హిందూ మతంలోకి మారినందుకు వసీం రజ్వీ తలకు రివార్డు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి రషీద్ ఖాన్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు భారత దేశాన్ని ఎప్పటికీ హిందూరాష్ట్ర్ కానివ్వనని శపథం చేశారు..
“నేను బతికి ఉన్నంత కాలం భారతదేశాన్ని హిందూదేశం కానివ్వను, నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, యోగీ , ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, బజరంగదళ్ ఈ దేశాన్ని హిందూరాష్ట్ర గా మార్చాలనుకుంటున్నాయి. కానీ వారి కలను ఎన్నడూ సాకారం చేసుకోలేరు. వాళ్ల కలను నేను నిజం కానివ్వను’ అని రషీద్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దేశంలో అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ, ముస్లింల గురించి పట్టించుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
రషీద్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. భారత్ హిందూదేశంగా మారబోతోంది. రషీద్ ఖాన్ వంటి వాళ్లు ఆ కల నెరవేర్చడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అని అన్నారు.
మతం మారి జితేంద్రనారాయణ్ సింగ్ త్యాగిగా పేరు మార్చుకున్న వసీం రిజ్వీ తల నరికి తెచ్చి ఇచ్చిన వారికి 25 లక్షలు రివార్డు ప్రకటించారు రషీద్ ఖాన్. షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చీఫ్ అయిన వసీంరిజ్వీ ఘజియాబాద్ లోని దాస్నా దేవీ ఆలయానికి చెందిన యతి నరసింహానంద్ మార్గదర్శనంలో హిందూమతం స్వీకరించారు.