“నేను తెలంగాణకు ప్రథమ పౌరురాలినే..! కానీ సామాన్య మహిళను” అంటూ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ గారు అభిప్రాయపడ్డారు. తమిళ సై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి నేటితో రెండు సంవత్సరాలు పూర్తి పూర్తి తీసుకుంది. ఈ సందర్భంగా బుధవారం రాజ్ భవన్ లో ప్రముఖ జర్నలిస్టులతో సమావేశం ఏర్పాటు చేసి, గడిచిన రెండేళ్ల తన అనుభవాలను పంచుకున్నారు. ఈ రెండు సంవత్సరాలలో కోవిడ్ మహమ్మారి తో చేసిన పోరాటం భాగ్యనగర్ లో వచ్చిన వరదలు, ఇతరత్రా సమస్యల గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మేలు చేయడంలో ముందు ఉంటానని చెప్పారు.
తెలంగాణతో పాటు పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తాను రాజ్ భవన్ ను ప్రజలకు చేరువ చేశానని చెప్పారు. పాండిచ్చేరిలో “రాజ భవనం” గా పిలిచే గవర్నర్ బంగ్లాను గవర్నర్ ఆఫీస్ గా పేరు మారుస్తూ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చాను అని తమిళ సై వివరించారు. రెండేళ్ల తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ పుస్తకం విడుదల చేసారు. సమావేశానికి హాజరైన జర్నలిస్టులు, సమాచార శాఖ అధికారులు, ఇతర ప్రముఖులు గవర్నర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.