ప్రముఖ మోటార్స్ కంపెనీ భారతీయ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.
చనిపోయిన కశ్మీర్ వేర్పాటు వాదులను గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 5న Kashmir Solidarity Day..కశ్మీరీ సంఘీభావ దినంగా అక్కడ జరుపుకుంటారు. 370 ఎత్తివేత తరువాత కశ్మీర్లో ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదు. పాకిస్తాన్లో మాత్రం ఆ రోజు సెలవుదినం. ఈ సందర్భంగా హ్యుండాయ్ పాకిస్తాన్ విభాగం తన ట్విటర్ అకౌంట్ ద్వారా “మన కశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం” అని #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసింది.
దీనిపై భారత నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చాలా మంది స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లో #BoycottHyundai అంటూ ట్వీట్ల వరద పారింది. వాహనదారులు హ్యుండాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరారు. కశ్మీర్ కోసం పాక్ చేసింది త్యాగాలైతే.. మరి ఏళ్లకేళ్లుగా భారతీయులు చేస్తున్నదేంటని కడిగిపడేశారు.
ఈ నేపథ్యంలో కొరియన్ కార్ల కంపెనీ హ్యుండాయ్… కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా హ్యుండాయ్ పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించబోమని స్పష్టం చేసింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి, మనోభావాలకు తాము కట్టుబడి ఉన్నామని హ్యుండాయ్ భారత విభాగం చెప్పుకొచ్చింది.