…………………………………
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి మరో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అరెస్టయి, ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ జాహెద్ అనే నిందితుడు, జైలు గోడల మధ్య నుండే విధ్వంసానికి ప్లాన్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ కుట్రలో భాగంగా నిందితుడు పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
……………………………………………………………………..
పోలీసుల సమాచారం ప్రకారం, అబ్దుల్ జాహెద్ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడు. జైలులో ఉన్నప్పటికీ, నిగూఢ మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లను ఉపయోగించి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలలో పేలుళ్లు జరిపేందుకు, మత విద్వేషాలను రేకెత్తించేందుకు ఈ నిందితుడు భారీ వ్యూహాన్ని రచించినట్లు సమాచారం. ఈ కుట్రకు సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ నుంచి నిందితుడికి భారీ మొత్తంలో నిధులు కూడా అందినట్లు పోలీసుల విచారణలో తేలింది. పేలుళ్లకు అవసరమైన గ్రనేడ్లు, ఇతర మందుగుండు సామాగ్రిని సమకూర్చుకోవడానికి జాహెద్ తన అనుచరులను పురమాయించినట్లు గుర్తించారు. గతంలోనే పోలీసులు ఇతని వద్ద నుంచి విదేశీ తయారీ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
……………………………………………………………………………
తాజాగా జైలు నుంచి ఫోన్ కాల్స్ వెలుగులోకి రావడంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాల మీద చాలా కఠినంగా ఉంటోంది. హైదరాబాద్ జైలు నుంచి జరుగుతున్న కుట్రను.. ఢిల్లీలోని జాతీయ నిఘా వర్గాలు పసికట్టాయి. వెంటనే ఇక్కడ పోలీసులను అప్రమత్తం చేయటంతో, భారీ కుట్రకు బ్రేక్ పడింది. జాతీయ సంస్థలతో కలిసి తెలంగాణ పోలీసులు … పేలుళ్ల కుట్ర ను నిలపగలిగారు.



