హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా.. బరిలోకి దిగి గెలుపు తెచ్చుకోవడం అధికార పార్టీలకు అలవాటు. కానీ హైదరాబాద్ స్థానిక సంస్థలు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పోటీ కి దూరంగా నిలుస్తోంది. మరో ప్రధాన పార్టీ టిఆర్ఎస్ కూడా పూర్తిగా దూరంగా నిలిచి మజ్లిస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ గులాబీ పార్టీల మద్దతుతో మజ్లిస్ పార్టీ అంకెల లెక్కల్లో పై చేయి సాధిస్తుంది. అయినప్పటికీ ఒంటరి గా బరిలోకి దిగిన బిజెపి తనదైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నది.
ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో బిజెపి ఓ పథకం ప్రకారం మజ్లిజ్తో తలపడాలనుకుంటోంది. ఇది ఏ మేరకు సాధ్యపడుతుందనేది ఎన్నికల నాటికి తేలాల్సి ఉంది. ఎంఐఎం, బీజేపీ మాత్రమే బరిలో ఉన్నా స్థానిక సంస్థల సీటును దక్కించుకోవాలని బిజెపి విశ్వ ప్రయత్నం చేస్తోంది. పార్టీలకు అతీతంగా అభ్యర్థుల్ని మంచి చేసుకునేందుకు బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మజిలీస్ పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ అగ్ర నేతల ఆశీస్సులు ఉన్నప్పటికీ.. స్థానిక నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు.
ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. మెజార్టీ ఓటర్లు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లే. ఇందులో బీజేపీ తరపున గెలిచిన వారు 23 మంది ఉండగా, వాళ్ళలో నలుగురు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు.
ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో రూపంలో బీజేపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. అలా మొత్తంగా చూసుకుంటే బీజేపీ బలం 29గా కనిపిస్తున్నా, దానిలో నుంచి పార్టీ మారిన వారిని తీసేస్తే బిజెపికి నికరంగా 25 ఓట్లు ఉన్నాయి. అదే సమయంలో అటు ఎంఐఎంకు 50 మంది సభ్యుల బలం ఉంది. దీనిని బట్టి చూస్తే బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేకున్నా అభ్యర్థిని పోటీకి పెట్టింది.
గెలుపు కోసం బిజెపి తనదైన అస్త్రాలు బలంగా వాడుతోంది.. ఎంఐఎంతో పోటీపడి అందరి దృష్టిని ఆకర్షిండం ద్వారా బిజెపి మరింత ప్రజాదరణ పెంచుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఇతర పార్టీల కార్పొరేటర్లను వీలైనంత వరకు తమ అభ్యర్థికి ఓటేయాలని కోరే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టిసారించిన బిజెపి తాజాగా హైదరాబాద్‌ను మజ్లిస్ చేతిలో పెట్టవద్దనే నినాదాన్ని చేసింది. సరిపడా బలం లేకపోయినా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిని బరిలోకి దిగడం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. గెలిచినా ఓడినా ఎంఐఎంతో పోటీకి బరిలో దిగడం ద్వారా తమ సత్తా చాటాలని భావించడం వెనుక ఏదైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా అనే చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం తమ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీని బరిలోకి దింపితే, ఆయనకు పోటీగా బీజేపీ గౌతమ్ రావును అభ్యర్థిగా నిలబెట్టి రంగంలో దింపింది. గెలిచినా గెలవకపోయినా ఈ ఎన్నికలో బిఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎంఐంఎంకు దగ్గరయ్యాయనే విషయాన్ని వెల్లడించే వ్యూహంతో బిజెపి ముందుకెళుతోంది. ఈ ఎన్నికతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూం ఏంటో ప్రజలు తెలిసిపోతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం చెప్పారు. మరో వైపు ఈ ఎన్నికను హిందుత్వం, ఎంఐఎంగా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా బిజేపీ వ్యూహం ఏమిటనేది వెల్లడిస్తున్నాయి.
మొత్తం మీద బీజేపీ ఆశించినట్లు క్రాస్ వోటింగ్ జరిగితే మాత్రం మరో ఎమ్మెల్సీ సీటు కమలం పార్టీ ఖాతాలో పడుతుంది. అదే ఆశతో బిజెపి నేతలు ముందుకు వెళ్తున్నారు.