జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎన్‌సిడబ్ల్యు సీరియస్ అయింది. రాష్ట్రంలో మైనర్ బాలికలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) చైర్పర్సన్ ఎన్‌సిడబ్ల్యు రేఖా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంలో తెలంగాణ పోలీసులు నేరుగా జోక్యం చేసుకుని మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్రం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందచేయాలని ఆదేశించారు.
రాజకీయ నేతల పిల్లలు కారులో మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసిన కేసు తమ దృష్టికి వచ్చిందని…విచారణ జరుపుతామని…ఇటీవల నగరంలో జరిగిన రెండు మైనర్ బాలికలపై అత్యాచారం కేసుల గురించి మాట్లాడారు రేఖాశర్మ.
హైదరాబాద్‌లో వారం వ్యవధిలో మైనర్లపై ఐదు అత్యాచార కేసులు నమోదయ్యాయని కమిషన్ కు కథనాలు అందాయని ఎన్సీడబ్ల్యూ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
“పోలీసుల పాత్ర రక్షించడం, నేరాలను నిరోధించడం మాత్రమే కాదు, అటువంటి విషయాలలో వేగంగా తగిన చర్యలు కూడా తీసుకోవాలి.” అని NCW ప్రకటనలో పేర్కొంది.
ఇదిలావుండగా, ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకుని బాలికలు, మహిళల భద్రత కోసం రాష్ట్రం తీసుకున్న చర్యలపై ఏడు రోజుల్లో వివరణాత్మక నివేదికను పంపాలని కోరుతూ ఎన్‌సిడబ్ల్యు చైర్పర్సన్ తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. ఈ విధంగా భవిష్యత్తులో జరిగే సంఘటనలను అరికట్టవచ్చు అని అన్నారు. ఈ లేఖ కాపీని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు కూడా పంపినట్లు తెలిపారు.
మైనర్ బాలికపై అత్యాచారం మొదటి కేసు మే 28న రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైంది. రెండవది మే 29న రాజేందర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని రెండు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం కోరారు.