హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు 350 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బాలికను మే 28న అమ్నీసియా పబ్ నుంచి కిడ్నాప్ చేసి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఐదుగురు మైనర్లు కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు దాదాపు 350 పేజీలతో జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ), నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో వేర్వేరుగా చార్జిషీట్ ను సమర్పించారు.
ఐదుగురు జువైనల్ లలో నలుగురికి జేజేబీ మంగళవారం బెయిల్ మంజూరు చేసి విడుదల చేసింది. ఐదో జువైనల్ బుధవారం తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ పొందాడు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలు సేకరించారు. నిందితులకు సంబంధించిన డీఎన్ఏ.. అత్యాచారం జరిగిన కారులో సేకరించిన నమూనాలతో సరిపోలడం ఈ కేసులో కీలకంగా మారింది.
అత్యాచారం జరిగిన మూడు రోజుల తర్వాత మే 31న జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో.. నిందితుడు మే 28 సాయంత్రం అమ్నీసియా అండ్ ఇన్సోమ్నియా పబ్‌లో తన మెర్సిడెస్ బెంజ్ కారులో మైనర్ బాలికను బలవంతంగా ఎక్కించుకున్నాడని, అక్కడి నుంచి పేస్ట్రీ షాప్ కు తీసుకెళ్లాడని.. అక్కడ ఆమెను టయోటా ఇన్నోవాలోకి తరలించాడని.. వారు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.
అత్యాచార ఘటనలో నిందితులపై పోలీసులు పోక్సో చట్టం తోపాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376-డి (గ్యాంగ్ రేప్), 323 (గాయాలు కలిగించడం), 376 (కిడ్నాప్) కింద కేసులు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 58 రోజులలో చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. “మేం 65 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసాం, ఛార్జిషీట్లో వాటిని పొందుపరిచాం” అని ఆయన చెప్పారు. నిందితుల నుంచి, నేరానికి ఉపయోగించిన కారు నుంచి సేకరించిన ఫోరెన్సిక్ నివేదికలు (FSL), DNA పరీక్ష ఫలితాలను కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో జతపరిచారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డులు, మెసేజ్ లు సహా ఫోటోగ్రాఫ్‌ల సీడీలను కూడా చార్జ్ షీట్లో చేర్చారు.