తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ అరెస్టు హాట్ టాపిక్ గా నిలిచింది. ఆయన్ని అరెస్టు చేయడం ఖాయం అన్నమాట బాగా చక్కర్లు కొడుతోంది. ఈ అనుమానాన్ని స్వయంగా కేటీఆర్ వెలిబుచ్చడం విశేషం. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని, అయినా తాను భయపడటం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఫార్ములా వన్ రేసు విషయంలో తెలంగాణకు మంచి జరిగిందని బిఆర్ఎస్, లేదు లేదంటూ కాంగ్రెస్ వాదిస్తూ వస్తున్నాయి. ఈ విషయం ఎలా ఉన్నా కానీ సాంకేతికంగా బిఆర్ఎస్ నాయకులు తప్పుచేసి దొరికిపోయారనేది వాస్తవం. పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలలో రూల్ పొజిషన్ మాత్రమే చూస్తారు. ఫార్ములా వన్ రేసింగ్ హడావిడిలో రూల్ పొజిషన్ దాటి కేటీఆర్ అనుమతి ఇచ్చారనేదే … ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్న విషయం. ఈ చిన్న లాజిక్ ఆధారంగా కేటీఆర్ ను రౌండ్అప్ చేయాలని సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ అయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్‌ను బాగా ప్రచారం చేసి నిర్వహించారు. మొదటి సారి రేస్ విజయవంతంగా జరుగగా.. రెండో సారి మాత్రం రేస్ జరుగకముందే స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ తప్పుకుంది. రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈ ఏడాది జనవరిలో కేటీఆర్‌తో పాటు ఆ ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోసారి ఏసీబీ అధికారులు .. కేటీఆర్ పిలవడంతో ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే అరెస్టు అంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
మొన్ననే కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల పైన జరిగిన విచారణలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇదే కేసులో మరో అగ్రనేత హరీష్ రావు తమ వివరణ ఇచ్చారు. దాదాపు కొన్ని వారాలపాటు కేసీఆర్ అండ్ టీం కాళేశ్వరం కమిషన్ విచారణ మీదనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇటు కేటీఆర్ మెడకు ఫార్ములా వన్ రేసింగ్ అంశం బలంగా బిగుసుకొంటోంది.
ఈ పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్టు వార్త గులాబీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. అదే జరిగితే గులాబీ వర్గాలను నిలుపుకోవడం కష్టంగా మారుతుంది. కేటీఆర్ నే అరెస్టు చేసినప్పుడు తమ పరిస్థితి ఏమిటని సాధారణ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.