ఊహించిన విధంగానే హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడో రేపో నోటిఫికేషన్ రావచ్చని ఎదురుచూస్తున్న సమయంలో కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో సాధారణ, ఉప ఎన్నికలు నిర్వహించడంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరుతూ ఈసీ లేఖలు రాసింది.
ఈ నెల 30 లోగా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని లేఖలో ఈసీ పేర్కొంది. ఐదు రాష్ర్టాలతోపాటు వివిధ రాష్ర్టాల్లో సుమారు 50 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా పార్టీల అభిప్రాయాలు పరిశీలించిన మీదట ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
దేశంలో మూడో వేవ్ అక్టోబరులో పీక్ స్టేజ్ కు చేరుకోవచ్చని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంటే అక్టోబర్ తరువాతనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఎన్నుకోవాల్సిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా కరోనా వ్యాధి ఉధృతి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈసీకి లేఖ రాశారు కూడా .
అయితే 119 ఎమ్మెల్యేలు ఓట్ చేసే ఎన్నికనే వాయిదా కోరిన ప్రభుత్వం,.. లక్షల మంది పాల్గొనే హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంసిద్ధతను వ్యక్తం చేయకపోవచ్చని అంచనా.
అటు రెండు రోజుల క్రితమే అధికార టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ఖరారు చేయడంతో… రాజకీయ పార్టీలు హుజూరాబాద్ లో దూకుడు పెంచాయి. దళితబంధు పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ నెల 16న హుజూరాబాద్‌లో 5 వేల మందికి 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు రెండు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించి ముఖ్యమంత్రి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడంతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో పర్యటించి పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అటు ఈటల సైతం ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ఆయన భార్య జమున కూడా ప్రచారరంగంలో దూసుకెళ్తున్నారు. ఈతరుణంలోనే ఈసీ రాజకీయ పార్టీలకు లేఖ రాయడంతో ఎన్నిక వాయిదా పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హుజూరాబాద్‌లో ఎంత ఆలస్యంగా ఎన్నిక జరిగితే ఈటల రాజేందర్ అంతగా బలహీన పడతాడని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది.