ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనలో జాతీయ రహదారులు అద్భుతంగా తయారవుతున్నాయి. పటిష్టమైన ఇంజనీరింగ్, నాణ్యమైన వసతులతో దేశం వ్యాప్తంగా జాతీయ రహదారులు ఆధునిక శోభనం సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సమకూర్చటమే ఆలస్యం.. ఆధునిక హంగులకు హైవేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించేస్తోంది.
ఇప్పుడు జాతీయ రహదారుల వెంట ఆధునిక టాయిలెట్లను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. వీటితోపాటు మహిళలకు
అవసరమైన ఇతర సదుపాయాలను కల్పించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ‘హమ్‌సఫర్ పాలసీ’ని ప్రారంభించారు.
ఈ పాలసీలో క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్, వీల్‌చైర్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్, పార్కింగ్ ప్లేస్, ఫ్యూయల్ స్టేషన్లలో హాస్టల్ తదితర సేవలను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విధానంలో హైవే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఆనందదాయకమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధిని సృష్టించడంతో పాటు కొత్తగా ఉద్యోగులు కల్పించి జీవనోపాధిని పెంచుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ హమ్‌సఫర్ బ్రాండ్ దేశంలోని ప్రపంచస్థాయి హైవే నెట్‌వర్క్‌లో ప్రయాణికులు, డ్రైవర్లకు అత్యంత భద్రతతో పాటు సౌకర్యాలకు పర్యాయపదంగా మారుతుందని తెలిపారు.
జాతీయ రహదారులపై నాణ్యమైన, ప్రామాణికమైన సేవలను అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మా హైవే నెట్‌వర్క్‌లో అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని గడ్కరీ చెప్పారు. ఈ పాలసీని సిద్ధం చేసే సమయంలో నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, వ్యర్థాల పునర్వినియోగం, సౌరశక్తి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకున్నట్లు ఆయన తెలిపారు.
పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు కేంద్రం ఈ సందర్భంగా వెల్లడించింది.
జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్ పంపుల యజమానులు పెట్రోల్ పంపుల వద్ద నిబంధనల ప్రకారం.. కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి కోరారు. హైవేల పక్కనే ఉన్న పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచి ప్రజలు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు.
ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లయితే జాతీయ రహదారుల మీద ప్రయాణం మరింత నాణ్యతతో కూడిన ఆహ్లాదకరంగా మారుతుంది.