కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. దీంతో రెండు ప్రభుత్వాలూ… పాలన లో ఏమో కానీ, అవినీతి లో సంబంధాలు పంచుకొంటున్నాయి. కర్నాటక లో బయట పడుతున్న స్కాం లలో కొన్ని మూలాలు తెలంగాణ లో బయట పడుతున్నాయి. దీనిని బట్టి రెండు రాష్ట్రాల అనుబంధం అర్థం అవుతుంది.
‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ.187 కోట్లు పక్కదారి పట్టాయి. వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ పీ చంద్రశేఖరన్ గత మే 26న ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఆరు పేజీల సూసైడ్ నోటులో స్కామ్ గురించి బయటపెట్టారు. దీనిపై విచారణ జరపాలని ఒత్తిడి పెరగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈడీ సైతం రంగంలోకి దిగింది. లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే ‘వాల్మీకి కార్పొరేషన్’ నిధులను అక్రమంగా వాడుకొన్నట్టు ఈడీ, సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది. కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ బసనగౌడ దద్దల్, మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా మొత్తం 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది.
రూ.187 కోట్లలో తెలుగు రాష్ర్టాలకు రూ.90 కోట్లు చేరినట్టు సిట్ అంతర్గత నివేదికలో వెల్లడించింది.
సిట్ నివేదిక ప్రకారం వాల్మీకి కార్పొరేషన్ అప్పటి ఎండీ పద్మనాభ్, అకౌంట్స్ అధికారి పరశురామ్ బెంగళూరులోని యూబీఐ బ్యాంకు ఎంజీ రోడ్డు బ్రాంచీలో మార్చి 30, 2024న రూ.50 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్‌పై అదే రోజు రూ. 45 కోట్ల రుణం తీసుకొని, హైదరాబాద్‌లోని ఆర్బీఎల్ బ్యాంకుకు చెందిన 9 ఖాతాలకు రూ.44.6 కోట్లను బదిలీ చేశారు.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. హైదరాబాద్ కు చేరిన రూ.44.6 కోట్ల నగదుతో లోక్‌సభ ఎన్నికల ముందు పెద్దయెత్తున మద్యం, ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నగదు బదిలీకి వినియోగించిన బ్యాంకు ఖాతాలు నకిలీవని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కామ్‌కు పాల్పడిందని, స్కామ్‌లోని రూ. 44.6 కోట్లు హైదరాబాద్‌కు చేరడాన్ని చూస్తే, ఇక్కడి కాంగ్రెస్‌కు కూడా ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్టు అర్థమవుతున్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే, రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చంటూ కర్ణాటక మంత్రి సతీశ్ జార్కిహోళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘వాల్మీకి’ సామాజికవర్గానికి చెందిన బలమైన నేత జార్కిహోళి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని చూస ఈ స్కామ్‌లోనే సీఎంకు నోటీసులు వస్తాయా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
సిట్ నివేదిక ప్రకారం సిస్టమ్ అండ్ సర్వీస్ కంపెనీకి రూ. 4.55 కోట్లు, రామ్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 5.07 కోట్లు, స్కిల్మ్యాప్ ట్రైనింగ్‌కు, రూ. 4.84 కోట్లు, స్వాప్ డిజైన్‌కు రూ. 5.15 కోట్లు, జీఎన్ ఇండస్ట్రీస్‌కు రూ. 4.42 కోట్లు, నోవెల్ సెక్యూరిటీకు రూ. 4.56 కోట్లు, సుజల్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 5.63 కోట్లు, గ్రాబ్ ఏ గ్రబ్‌కు రూ. 5.88 కోట్లు, వీ6 బిజినెస్‌కు రూ. 4.50 కోట్లు అందాయి.
మొత్తం మీద వాల్మీకి స్కాం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య అవినీతి బంధం అర్థం అవుతుంది.