లక్ష ట్రాక్టర్ల ఖర్చెంత? ఎవరు భరిస్తున్నారు!?
పంజాబ్ నుంచి ఢిల్లీపై దండెత్తిన కొందరు రైతులు, మద్దతుదారులు రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ ర్యాలీ కోసం జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. లక్ష నుంచి రెండు లక్షల ట్రాక్టర్లతో ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో కదం తొక్కుతారట. ఇన్ని ట్రాక్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పంజాబ్ నుంచి బయల్దేరిన ట్రాక్టర్లు, డ్రయివర్లు, ఇంధనం, భోజనాలు వంటి వాటికి ఎంత ఖర్చవుతుంది? ఈ డబ్బు ఎవరిస్తున్నారు? ఈ వివరాలను ఎవరూ చెప్పడం లేదు. పైగా ఈ ర్యాలీ ముగియడానికి 24 నుంచి 48 గంటలు పడుతుందట. ఇప్పటికే ఇన్ని రోజులుగా ఢిల్లీ శివార్లలోని హైవేలను ఆక్రమించిన వేల మందికి రోజూ రెండ పూటలా భోజనాలు పెడుతున్నారు. ఆధునిక టెంట్లను సమకూర్చారు. ఇంకా అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఇంత డబ్బు ఎక్కడిది?
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏడాది క్రితం ఢిల్లీ షాహీన్ బాగ్ లో ఆందోళన జరిగింది. ఒక విశాలమైన రహదారిని ఆక్రమించి వందల పడకలు, వేల కుర్చీలు, భారీగా టెంట్లు, పెద్ద ఎత్తున వంటశాలలు ఏర్పాటు చేశారు. పిఎఫ్ ఐ వంటి దేశ వ్యతిరేక సంస్థలు ఆ ఆందోళనను స్పాన్సర్ చేశాయని నిఘా సంస్థలకు సమాచారం అందింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షాహీన్ బాగ్ ధర్నాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రచారాంశంగా కూడా వాడుకుంది.
ఆప్ ఎప్పుడూ దేశహితం పట్టని పార్టీయేమో అనే విధంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు రైతుల ఆందోళన అనే కార్యక్రమానికి సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు గట్టి మద్దతు ఇస్తున్నారు. ఇంతకీ ఈ ట్రాక్టర్ల ఖర్చు ఎవరు భరిస్తారనేది మిస్టరీగా ఉంది. బక్క రైతులు ఆందోళనకు దిగితే తాము సమయాన్ని, దాచిపెట్టుకున్న కొద్దిపాటి డబ్బును ఖర్చు పెట్టగలరు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రోజుల పాటునిరసనలకు ఖర్చు భారీగానే అవుతుంది. పాపం బక్క రైతులు ఇంత ఖర్చు భరించ లేరు. మరి ఈ ఖర్చును స్వచ్ఛంద సంస్థలు భరిస్తున్నాయా? కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయా? లేక దేశ వ్యతిరేక శక్తులు చొరబడ్డాయా? అనేది తెలియాల్సి ఉంది.