వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని మసీదుల్లో పనిచేసే ఇమామ్ లకు గౌరవ వేతనాలు సరైందేనంటూ 1993లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్. ఆ తీర్పుతో దేశంలో ఓ తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టడంతో పాటు అనవసర రాజకీయ వివాదానికి తెరలేపినట్టైందన్నారు.అంతేకాదు సమాజిక అసమానతలకు అది కేంద్రబిందువైందనీ ఉదయ్ అన్నారు. ఇమామ్ లకు ఢిల్లీ ప్రభుత్వం, డిల్లీ వక్ఫ్ బోర్డు చెల్లిస్తున్న వేతనాల వివరాలు తెలపాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా మహుర్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఖజానానుంచి ఇమామ్ లు, మౌజన్ లకు ప్రత్యేక ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకే ఈ తీర్పు అని అన్నారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏ మతానికీ అనుకూలంగా వినియోగించకూడదనే రాజ్యాంగంలో ఆర్టికల్ 27 నిబంధనలను ఉల్లంఘించడమే అనీ అన్నారు. రాజ్యాంగంలోని 25 నుంచి 28 వరకు ఉన్న ఆర్టికల్ల నిబంధనలు అమలయ్యేలా అన్ని మతాల పూజారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానా నుంచి నెలవారీ వేతనాలు చెల్లించేలా చూసేందుకు తన ఆర్డర్ కాపీని కేంద్ర న్యాయ మంత్రికి పంపాలని ఆయన ఆదేశించారు. 1993 మే 13న ఈ తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు.