ఈ కాలం విద్యార్థులు యువతకు భారతీయ విడుదల సంస్కృతి గొప్పతనం తెలియడం లేదు. దీంతో సమాజంలో అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించేందుకు ఈ తరం యువతకు విలువలను తెలియజేసేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని భాగ్యనగర్ లో సంకల్పించారు. హిందూ ఆధ్యాత్మిక మరియు సేవా ఫౌండేషన్.. HSSF… సేవా ప్రదర్శిని పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నెల 8 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు.. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీనిని నిర్వహిస్తున్నారు . ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో మానవీయ విలువలతో కూడిన ఆధ్యాత్మికతను పెంపొందించడమే లక్ష్యంగా ఇది జరుగుతుందని.. నిర్వాహకులు తెలిపారు.
గురువారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రామకృష్ణ మిషన్ కు చెందిన స్వామి శితికంతానంద, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం IAS (రిటైర్డ్) సమక్షంలో.. శ్రీ శ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వారు ఈ వేడుకలను ప్రారంభిస్తారు. చివరిరోజు పరమ వీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర యాదవ్ పరమ వీర్ వందన్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ముగింపు వేడుకల్లో తెలంగాణ మంత్రి డి.శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో 120కి పైగా ఆధ్యాత్మిక మరియు సమాజ సేవా సంస్థలు తమ స్టాళ్ల కోసం పేర్లు నమోదు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా సంస్థలు ఈ సమాజానికి అందించే సేవల గురించిన సమాచారాన్ని ప్రదర్శిస్తాయి.
పాఠశాల విద్యార్థులు యువతకు భారతీయ విలువల గొప్పతనం తెలిపేందుకు ఈ దిగువ అంశాలపై వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
1. అడవులను సంరక్షించడం మరియు వన్యప్రాణులను రక్షించడం
2. సకల జీవ చరాలను పర్యావరణాన్ని సంరక్షించడం
3. పర్యావరణాన్ని పరిరక్షించటం
4. కుటుంబం మరియు మానవ విలువలను పెంపొందించుకోవడం
5. మహిళలను గౌరవించడం
6. దేశభక్తిని పెంపొందించటం
ఈ సేవ ప్రదర్శిని లో.. ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు చోటు లేదు. ఇది పూర్తిగా సమాజసేవ మార్గంలో నిర్వహిస్తున్నారు. అలాగే స్టాళ్ల నిర్వహణ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకు కావాల్సిన అన్ని ఖర్చులను HSSF భరించనుంది. ఇలాంటి మేళాలు.. హైదరాబాద్ సహా చెన్నై, బెంగుళూరు, తిరువనంతపురం, గురుగ్రామ్, జైపూర్, ఇండోర్, ముంబై, రాయ్‌పూర్, భువనేశ్వర్, రాంచీ మొదలైన నగరాలలో కూడా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని విద్యార్థులు యువతను సేవా ప్రదర్శిని నిర్వాహకులు కోరుతున్నారు