బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల మీద యావత్తు హైందవ సమాజం మండిపడుతోంది. ఇస్కాన్ గురువు చిన్నోయి కృష్ణదాస్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తున్నారు. హిందువులపై దాడులను నిలిపివేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహిని తదితర సంస్థల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.
హైదరాబాద్ లోని అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహిని వంటి సంస్థల కార్యకర్తలతో పాటుగా స్థానిక ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లపై నిరసన తెలియజేశారు. అల్లరి మూకలను కట్టడి చేయాల్సిన బంగ్లాదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతున్న హైందవ మత పెద్దలు, ఇస్కాన్ సంస్థల గురువులను ప్రభుత్వపరంగా వేధించడాన్ని ఖండించారు. బెయిల్ ఇవ్వడానికి వీలులేని విధంగా కఠినమైన సెక్షన్లతో చిన్మోయ్ కృష్ణదాస్ ను అరెస్టు చేయడాన్ని ముక్తకంఠంతో తప్పు పడుతున్నారు.