పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఇంటి వెలువల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించాలని కోల్ కతా హైకోర్టు పశ్చిమబెంగాల్ సర్కారును ఆదేశించింది. అంతే కాదు రాత్రి 8 గంటల తరువాత ఆ పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదనీ ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలని సెంట్రల్ రిజర్వ్ ఫోలీస్ ఫోర్స్…CRPF కు సూచించింది ధర్మాసనం.
ఈస్ట్ మిడ్నాపూర్ ఎమ్మెల్యే అయిన సువేందు అధికారి కోంటాయ్ లోని తన పూర్వీకుల ఇంట్లో ఉంటారు. ఆయనకు ‘Z’ కేటగిరీ భద్రత ఉంటుంది. అయితే ఇంటిముందు రాష్ట్ర పోలీస్ పాయింట్ ద్వారా అమర్చిన సీసీ కెమెరాలు తన ప్రైవసీని ఉల్లంఘించేలా ఉన్నాయని..అలాగే తెల్లవారుజామున 2 గంటల వరకూ లౌడ్ స్పీకర్లు వాడుతున్నారని అది తనకు చాలా ఇబ్బందిగా ఉందని…ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు తనింటి పరిసరాల్లో జరుగుతున్న రాజకీయ ర్యాలీలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు సువేందు.
పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆయన ఇబ్బందులు పరిగణనలోకి తీసుకుని సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
పిటిషనర్ ప్రతిపక్ష నాయకుడని… ఆయనకున్న అన్ని అధికారాలు పొందేందుకు అర్హులని ప్రతివాదులు గుర్తించాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీసీటీవీ కెమెరాలు ఉంచడం అనంటే పిటిషనర్ భద్రతకు బాధ్యత వహించే అధికారుల పరిధిలోకి వస్తుంది. అయితే వాటి కారణంగా సదరు వ్యక్తి గోప్యతపై దాడి జరగుతోంది అన్నప్పుడు సీఆర్పీఎఫ్ దాన్ని పరిష్కరించాలని కోర్టు ఆర్డర్లో పేర్కొంది. అంతే కాదు రాత్రి 8 గంటల తరువాత తనింటి ముందు లౌడ్ స్పీకర్ల వల్ల విపరీతమైన శబ్దకాలుష్యం ఏర్పడుతోందని పిటిషన్ అంటున్నారు.. ఇక నుంచి ఆ చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు లేకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. ఇక సువేందు అధికారి నివాసం పరిసరాల్లో రాజకీయ ర్యాలీలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల గురించి నియమ నిబంధనలను బట్టి తగు సూచనలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.