కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య వైపునకే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపుతోంది. అనుభవానికి పెద్దపీట వేస్తూ ఆయన్నే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని నిర్ణయించింది. సీఎం రేసులో ఉన్న మరో సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ను అధిష్ఠానం బుజ్జగిస్తోంది. ఆయన్ని డిప్యూటీ సీఎంగా నియమిస్తామని అంటోంది. దాంతో పాటు పీసీసీ చీఫ్ గా ఆయన్నే కొనసాగించాలనుంకుంటోంది. అయితే డిప్యూటీ సీఎం పోస్ట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న డీకే…ఎమ్మెల్యేగానే కొనసాగుతానని పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. రాహుల్ గాంధీ ఇద్దరు నాయకులతో సమావేశమై సీఎం ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయాన్ని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సిద్ధరామయ్య, డీకే సమక్షంలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధరామయ్యే సీఎం అవుతున్నారన్న వార్తతో బెంగుళూరులోని ఆయన ఇంటిదగ్గర కోలాహలం నెలకొంది. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనింటికి తరలివస్తున్నారు. డీకేతో పాటు లింగాయత్, దళిత, మైనార్టీ వర్గాలకూ డిప్యూటీ సీఎం పదవిని కేటాయించనున్నారని తెలుస్తోంది.