న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్టయ్యారు. పోలీసుల అన్ని సెలవుల్ని రద్దు చేశారు. డిసెంబర్ 31తో పాటు వారాంతపు సెలవుల్నీ రద్దు చేశారు. ప్రతీ పోలీసు డ్యూటీ చేయాల్సిందే. ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ముంబై, దాదర్, బాంద్రా చర్చిగేట్, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, కుర్లా, ఇతర స్టేషన్లలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో భద్రతను పర్యవేక్షించేందుకు రేపు 3000 మందికి పైగా రైల్వే అధికారులను మోహరించనున్నట్లు ముంబై రైల్వే పోలీసు కమిషనర్ క్వాయిజర్ ఖలీద్ తెలిపారు.
కోవిడ్ -19 నేపథ్యంలో CrPC సెక్షన్ 144 కింద ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఓమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బులను మూసివేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వేడుకలు, సమావేశాలకు అనుమతి లేదు.
లూథియానా కోర్టు బాంబు పేలుడు సూత్రధారిగా భావిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది ముల్తానీని జర్మనీలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోనూ పేలుళ్ల కుట్ర పన్నినట్టు నిఘావర్గాలకు సమాచారం ఉంది. దీంతో హై అలర్ట్ ప్రకటించారు.