బెంగళూరు రేవ్ పార్టీ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో చాలామంది సినిమా, టీవీ ప్రముఖులు ఉండడంతో సంచలనం రేకెత్తింది. తెలుగు సినిమా రంగానికి చెందిన కొంతమంది పేర్లు చక్కర్లు కొట్టినప్పటికీ అవన్నీ తప్పు అని తేలింది. కానీ కామెడీ నటి హేమ మాత్రం ఇందులో చిక్కుకున్నారు.
అసలు రేవ్ పార్టీ ఘటన బయటకు రాగానే హేమ తెలివిగా వ్యవహరించారు. బెంగళూరు నుంచి ఒక వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాకు రిలీజ్ చేశారు. ఈ పార్టీతో ఏమాత్రం సంబంధం లేదని, హైదరాబాద్లోనే ఉన్నానని ఆమె చెబుతూ వచ్చారు. అయితే పార్టీలో కృష్ణవేణి పేరుతో ఆమె టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే పక్కదారి పట్టించేందుకు హేమ ప్రయత్నం చేశారు. కానీ వెంటనే అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు ..హేమ బండారం బయటపెట్టారు . పైగా రక్తపు పరీక్షల్లో హేమ కొన్ని డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
తాజాగా పోలీసుల విచారణకు హాజరు కావాలని హేమకు బెంగళూరు నుంచి అధికారులు నోటీసు పంపించారు. కానీ సీసీబీ విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని విచారణకు రాలేనంటూ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు గడువు కోరుతూ లేఖ రాశారు. హేమ లేఖను పరిగణనలోకి తీసుకోని సీసీబీ.. హేమకు మరోసారి నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది.
దీంతో కష్టాలు తప్పడం లేదు.
బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వారిలో టాలీవుడ్ కు చెందిన నటి హేమ కూడా ఉన్నారు. ఈరోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మంది విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని హేమ లేఖలో పేర్కొన్నారు.
మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీ ఘటన బయటపడినప్పటినుంచి హేమను పోలీసులు వెంటాడుతున్నారు. అంతకుమించి సోషల్ మీడియాలో ఆమె కోసం ఆరాలు విపరీతంగా మొదలయ్యాయి . బెంగళూరు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా హేమ ఎవరు.. ఆమె కుటుంబ సభ్యులు ఎవరు .. కులం ఏంటి.. గతంలో ఉన్న వివాదాలు ఏంటి ..అనే దానిమీద విస్తారంగా వెతికేస్తున్నారు .సోషల్ మీడియాలో కూడా మీమ్స్ ,, ట్రోల్స్ విపరీతంగా వచ్చి పడుతున్నాయి.