ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ సర్కారు సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఒక చక్కటి ఉత్తర్వు విడుదల చేశారు. దీని ప్రకారం భారతదేశానికి చెందిన నలుగురు విశిష్టమైన వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
భారతదేశం నలుమూలల నుంచి ఈ నలుగురిని ఎంపిక చేయడం విశేషం. చరిత్రకారిణి మీనాక్షి జైన్,అధ్యాపక రంగ నిపుణులు సదానందన్ మాస్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం, విదేశాంగ మాజీ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ నలుగురు.. దేశంలోని నాలుగు దిక్కుల నుంచి ఎంపిక చేసుకోవడం అత్యంత యాదృచ్చికంగా అనిపిస్తుంది. మీనాక్షీ జైన్ ఢిల్లీ నుంచి అంటే ఉత్తర భారతం, హర్ష్ వర్ధన్ శ్రింగ్లా స్వస్థలం.. డార్జిలింగ్ అంటే తూర్పుభారతం, ఉజ్వల్ నికం ముంబై అంటే పశ్చిమ భారతం, సదానందన్ మాస్టర్ కేరళ అంటే దక్షిణ భారతం నుంచి ఎంపిక చేశారు.
డా.మీనాక్షి జైన్ విషయం చూస్తే.. భారతీయ జ్ఞానానికి నిలువెత్తు ప్రతిరూపం. చరిత్రకారిణి, రచయిత, అధ్యాపకురాలు మాత్రమే కాదు, భారతీయ నాగరికతపై తడబడిన నిజాలను వెలికితీసిన ధైర్యవంతురాలు. గత రెండు దశాబ్దాలుగా మన నాగరిక చరిత్రను భారతీయ దృక్పథం నుండి పునర్ని ర్మించడానికి ప్రయత్నించారు. మధ్యయుగ దండయాత్రలు, ఆలయ విధ్వంసాలు, మొఘల్ పాలన వంటి అంశాల్లో చరిత్ర పరిశోధకురాలుగా ఆమె భిన్నమైన ధోరణితో వెళ్లారు. భారతదేశ చరిత్రను పాశ్చాత్య మేథతో కాకుండా భారతీయ దృక్కోణంలో వివరించడమే జైన్ ప్రత్యేకత.
మీనాక్షి రాసిన “The Hindus of Hindustan : A Civilizational Journey” లో.. హిందూ ధర్మం ఎలా రూపుదిద్దుకుంది..? సంస్కృతీ పరంపర ఎలా అభివృద్ధి చెందిందో ఎన్నో ఉదాహరణలతో వివరించింది. తన మరో పుస్తకం “Vishwanath Rises and Rises – The Story of Eternal Kashi” లో.. కాశీ విశ్వనాథ ఆలయ చరిత్రను కళ్లకు కట్టారు. వినాశమే కాదు, పునరుజ్జీవం కూడా మన చరిత్రలో భాగం అని ఆమె నమ్మకం. “Vasudeva Krishna and Mathura” లో శ్రీకృష్ణుడు చారిత్రిక వ్యక్తిత్వాన్ని జైన్ ఆవిష్కరించారు. అలాగే 2013 లో ఆమె రాసిన “రామ అండ్ అయోధ్య” పుస్తకంలో అయోధ్య లో రామ జన్మభూమిపై చారిత్రక ఆధారాలు చూపించారు. 2017 లో “ది బ్యాటిల్ ఫర్ రామ – కేస్ ఆఫ్ ది టెంపుల్ ఎట్ అయోధ్య” వంటి పుస్తకాలతో మన చరిత్రను భారతీయ దృక్పథంతో అందజేశారు.
ఇక మరో వ్యక్తి సదానందన్ మాస్టారు.. కేరళలోని కన్నూర్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త. సామాజిక సేవలో నిత్యం ముందుండే సదానందన్ మాస్టర్ అందరూ “మృత్యుంజయుడు” గా పిలుచుకుంటారు. 1994 లో సీపీఎం కార్యకర్తలు జరిపిన ఘోర దాడిలో రెండు కాళ్లూ కోల్పోయారు. అయినా.. సీపీఎం నేతల గుండాగిరీకి ఏమాత్రం వెరవకుండా.. సిద్థాంతం పట్ల, అంతే స్థిరచిత్తంతో సామాజిక సేవలో పాల్గొన్నారు. నేషనల్ టీచర్స్ ఫెడరేషన్ కు అఖిల భారత ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు. పాత్రికేయులుగా ఎన్నో రచనలు చేశారు.
విచిత్రం ఏంటంటే.. సదానందన్ మాస్టారూ ఒకప్పుడు సీపీఎం యూనిట్ కార్యదర్శి. అయితే ఎదుగుతున్నా కొద్దీ.. ఆ భావజాలంలో వున్న శూన్యతను, డొల్లతనాన్ని, హింసావాదాన్ని వ్యతిరేకించాడు. ఆ తర్వాత సీపీఎంను విడిచిపెట్టారు. అయితే సీపీఎంను వదిలిపెట్టడాన్ని పెద్ద నేరంగా భావించారు వాపపక్షవాదులు. ఈ క్రమంలో 1994, జనవరి 25 న కమ్యూనిస్టు కార్యకర్తలు సదానందం మాస్టార్ పై అత్యంత పాశవికంగా, గూండాల మాదిరిగా క్రూరంగా దాడి చేశారు. అతని రెండు కాళ్లనూ నరికేశారు. అప్పటి నుంచి కృత్రిమ కాళ్లను అమర్చుకొని నడుస్తున్నారు. కమ్యూనిస్టుల కంచుకోట అయిన కన్నూర్ లో ప్రజలకు నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో చూపిస్తున్నారు. అలాంటి సదానందన్ మాస్టార్ ను రాజ్యసభకి నామినేట్ చేయడం అంటే.. ఓ విద్యాధికుడికి, సామాజిక సేవకుడికి గౌరవం లభించినట్లే అని చెప్పవచ్చు.
మూడో వ్యక్తి ఉజ్వల్ న్యాయరంగ నిపుణులు.
1993 ముంబై దాడుల నుంచి ఇటీవలి 2008 దాడుల వరకు ఎన్నో కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రసిద్ధికెక్కినవారు.. ఉజ్వల్ నికమ్. మహారాష్ట్రకు చెందిన నికమ్ కు.. ఉగ్రవాదం, న్యాయశాస్త్రం, క్రిమినల్ లా వంటి అంశాలపై పట్టు ఎక్కువ. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీకి అనుబంధంగా, సీఎం ఫడ్నవీజ్ కు మద్దతున్న న్యాయవాదిగా పేరు గాంచారు.
1991 కళ్యాణ్ పేలుళ్లతో తన కెరీర్ ను ప్రారంభించిన నికమ్.. తన వృత్తిలో ఎన్నో పేరుమోసిన కేసుల్లో వాదనలు వినిపించారు. 2003లో గేట్ వే ఆఫ్ ఇండియా ఇంకా జవేరి బజార్లలో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసు, గుల్షన్ కుమార్ హత్య కేసు, 2013 లో శక్తి మిల్స్ సామూహిక అత్యాచారం కేసుల్లో తన వాదనలతో పేరు గాంచారు. వీటితో పాటు.. 26/11 ముంబై పేలుళ్లలో తన వాదనలతో కసబ్ కు ఉరిశిక్ష పడేలా చేశారు. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయాన్ని నిరూపించడానికి నికమ్.. అంతర్జాతీయ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీని కూడా విచారించారు. నికమ్ రాజ్యసభలో ప్రవేశించడం అంటే.. కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వంటి వారిని ఎదుర్కోవడానికి బీజేపీకి మంచి ఆయుధం దొరికినట్లే అని చెప్పొచ్చు.
నాలుగో వ్యక్తిని అద్భుతమైన మేధావి అని పిలుచుకోవచ్చు.
డార్జలింగ్ కు చెందిన హర్ష్ వర్ధన్ శ్రింగ్లా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. చాలాకాలం పాటు విదేశాంగ కార్యదర్శి గా పనిచేసిన ఆయనకు దౌత్యరంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఇటీవల భారత్ లో జరిగిన G20 సదస్సుకు చీఫ్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఈయనది సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఎంపిక అని చెబుతున్నారు.
1984 బ్యాచ్ కు చెందిన IFS అధికారి అయిన శ్రింగ్లా.. అమెరికా, థాయ్ ల్యాండ్ రాయబారిగా, బంగ్లాదేశ్ లో హైకమిషనర్ గా పనిచేశారు. 2019 లో టెక్సాస్ లో జరిగిన హౌడీ-మోడీ కార్యక్రమం.. శ్రింగ్లా రాయబారిగా ఉన్న సమయంలోనే నిర్వహించారు. 2020 నుంచి 2022 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. ఈ ఎంపిక విదేశాంగ వ్యవహారాలు, వాణిజ్య విధానంపై విశ్వసనీయ సాంకేతిక నిపుణుడిని పార్లమెంటులో చేర్చే ప్రయత్నం అని చెప్పొచ్చు. ఒక జయశంకర్, ఒక అశ్విని వైష్ణవ్ తరహాలోనే.. కేవలం రాజకీయ నాయకులనే కాకుండా, బ్యూరోక్రాట్లను, మేధావులను, భిన్నరంగాలకు చెందిన నిపుణులను కూడా పార్లమెంటులో నిర్మాణాత్మక, నాణ్యమైన చర్చలు, సూచనల కోసం ప్రవేశపెట్టడమే ఇది అని చెప్పొచ్చు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిఫార్సుదారులు, రాజకీయాల్లో అడ్డదారులు తొక్కే వాళ్లను రాజ్యసభకు నామినేట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుంచి ఈ విషయంలో హుందాగా వ్యవహరిస్తుంది. మరి ముఖ్యంగా ఈసారి చేసిన ఎంపిక మీద దేశమంతటా హర్షం వ్యక్తం అవుతోంది