పుర్రెకో బుద్ధి , జిహ్వకో రుచి అంటారు. ఇక పాశ్చాత్యపు పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు భారతగడ్డపైకీ వచ్చేస్తున్నాయి ఎప్పటినుంచో. అలాంటి వింత ఆచారమే సోలోగమి. అంటే స్వీయ వివాహం. అంటే తనను తానే పెళ్లాడడం అన్నమాట. గుజరాత్ వడోదరాకు చెందిన 24 ఏళ్ల క్షమా అలాంటి పెళ్లే చేసుకుంటోంది. జూన్ 11 అందుకు ముహూర్తం.
పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడుముళ్లు, ఏడు అడుగులు అంటాం. ఓ జంట కేంద్రంగా ఈ సంబరం జరుగుతుంది. కానీ సోలోగమీ అంటే ఒకరే ఉంటారు. వాళ్లను వాళ్లే పెళ్లాడతారు.
ఓ ప్రైవేట్ ఉద్యోగి అయిన క్షమా తన నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకుంటోంది. తను పెళ్లి చేసుకోవాలనుకోలేదట. కానీ పెళ్లికూతురుగా ముస్తాబు అవ్వాలనుకుందిట. అందుకే తనను తాను పెళ్లాడుతున్నానంటోంది. ఎవరినో కాక తనను తాను ఇష్టపడుతున్నాననీ చెప్పుకొస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నాక ఇలాంటి పెళ్లి దేశంలో ఎక్కడైనా జరిగిందా అని వెతికిందట. కానీ ఎక్కడా కనిపించలేదట. దేశంలో మొదటి సోలోగమీ పెళ్లి చేసుకున్న రికార్డు తనదేనని మురిసిపోతోంది క్షమా. అయితే క్షమా నిర్ణయం తెలిసి ఇదేం ఆచారం అంటూ బంధుమిత్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లే కాదు గోవాకు హనీమూన్ కూడా వెళ్లనుంది ఈ యువతి.