హైదరాబాదులో నిషేధిత ఆల్ ఖైదా లేడీ డాన్ కొంతకాలం ఉండేది అన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా బెంగళూరు అరెస్టు లల్లో ఈ విషయం బయటపడింది. అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఎక్యూఐఎస్) తరపున పనిచేస్తున్న 30 ఏళ్ల షామా పర్వీన్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్‌కు చెందిన ఆమె గత నాలుగేళ్లుగా బెంగళూరులో ఉంటున్నట్లు తెలిపారు. కర్ణాటక నుంచి ఆమె ఉగ్రవాదులకు సహాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అంతకుముందు కొన్ని రోజులు హైదరాబాద్‌లోనూ నివసించిందని, ఆ తర్వాతే బెంగళూరుకు మకాం మార్చిందని తెలిపారు.
హైదరాబాదులో లేడీ డాన్ కార్యకలాపాల మీద ఆరా తీస్తున్నారు.
ఆమె ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఒక అల్‌ఖైదా ఆపరేటివ్ వీడియోను కూడా ఆమె షేర్ చేసినట్లు గుర్తించారు. షామా పర్వీన్‌ను బెంగుళూరులో అరెస్ట్ చేసి అహ్మదాబాద్ తరలించారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నవారిని గుర్తించడానికి అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగానే ఆమెను అరెస్ట్ చేశారు. జులై23న ఎక్యూఐఎస్తో సంబంధమున్న మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్ అనే నలుగురు ఉగ్ర అనుమానితులను గుజరాత్, దిల్లీ, నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ గ్రూప్ సభ్యులు ఉన్నారని తెలిపారు. వారందరికీ షామా పర్వీన్ నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. వీరంతా సోషల్ మీడియాలోని ఓ రహస్య, ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారని వెల్లడించారు.
ఈ టీం చాలా కుట్రలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు అమలుచేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించామని చెప్పారు. రహస్య, ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహించడంతో పాటు ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్నట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్ష ఉపాధ్యాయకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
అనేక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. ముస్లిం యువతను రెచ్చగొడుతూ.. దేశానికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించడానికి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను వినియోగిస్తున్నట్లు తేలింది.
దీంతో ఆ దిశగా పోలీసులు అడుగులు వేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ సిద్ధార్థ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందం.. ఆయా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అల్‌ఖైదా ఉగ్రవాదులను గుర్తించింది.
అల్‌ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్‌సెల్ విభాగంతో, విదేశాలలోని ఉగ్ర సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వీరు ఉగ్ర ముఠాలకు చేరవేస్తున్నారని అధికారులు అంటున్నారు.
మొత్తం మీద హైదరాబాదులో కొంతమేర ఉగ్రవాదం మూలాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇంకా స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారా అనే దానిమీద అనుమానాలు కలుగుతున్నాయి.