తల్లి కూతురు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తే వినడానికి భలే ఉంటుంది కదా. అంతేకాదు ఇద్దరూ కూడా చూడ చక్కని జీవితం గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు సంపాదించారు. ఇదేమీ అకస్మాత్తుగా వచ్చి పడిన లాభం కాదు. దీని వెనక ఇద్దరు మహిళల నిరంతర శ్రమ పట్టుదల దాగి ఉన్నాయి.
తల్లి పద్మ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్ట్ ని కుమార్తె అలేఖ్య చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ ని ఒకే సీజన్లో సొంతం చేసుకున్నారు.
మన తెలంగాణ గడ్డమీద దసరా ఉత్సవాలు జరుగుతున్న వేళ మన ఆడపడుచుల విజయ గాథ తెలుసుకుందాం.పెద్ద కుటుంబంలో చిన్న కోడలు గా అడుగుపెట్టారు పద్మ.
పెళ్లయిన 12 సంవత్సరాల తరువాత తిరిగి చదువును కొనసాగించాలనుకుంది పద్మ. అలా మొదలు పెట్టి.. రాసిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పాసై అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్పీఎస్సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్ కాలేజ్‌లో పీజీటీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి పద్మ మాట్లాడుతూ – ‘మాది మంథని దగ్గరి రామకృష్ణాపూర్. పదో తరగతి పూర్తయ్యాక వివాహం అయింది. ఎనిమిది మంది సంతానం గల పెద్ద కుటుంబానికి చిన్న కోడలుని. మా అమ్మాయి అలేఖ్య ఆరో తరగతి వచ్చే వరకు ఇంటి పనులు చక్కదిద్దడం, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, వంటా వార్పుతోనే సరిపోయేది. పాప తన పనులు తాను చేసుకునే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. చాలా సార్లు చదువు పైన నాకు ఇష్టం ఉందని గ్రహించిన మా వారు తిరిగి చదువుకొమ్మని ప్రోత్సహించారు. అలా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. తొలి ప్రయత్నంలోనే పాసవడంతో మరింత ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా బీఈడి, ఆ పైన ఎంఈడి పూర్తి చేశాను. ఎంఈడిలో నాది రాష్ట్రంలో 9వ ర్యాంకు. జాతీయ పరీక్ష నెట్లో కూడా అర్హత సాధించాను. తొలి ప్రయత్నంలోనే రెసిడెన్షియల్ టీచర్‌గా ఎంపికయ్యాను. టీజీటి, పీజీటి స్థాయి పోస్టుల్లో రెండేసి సబ్జక్టుల్లో తెలుగు, సోషల్‌కు ఎంపికయ్యాను. ఫైనల్‌గా పీజీటి తెలుగులో జాయిన్ అయ్యాను’ అని వివరించింది పద్మ.
ఇక కుమార్తె అలేఖ్యది మరో విజయ గాధ. అమ్మతో పోటీ పడిన కూతురు
తనేమీ తక్కువ కాదనుకున్న కూతురు అలేఖ్య మరింత ఎక్కువగా శ్రమ పడి టీఎస్ పీఎస్సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించింది. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీడీపీవో(చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి అలేఖ్య మాట్లాడుతూ –‘చిన్నప్పటి నుంచి చదువులో అమ్మా, నాన్నల ప్రోత్సాహం చాలా గొప్పది. నాన్న బాగా ఎంకరేజ్ చేశారు. çపది, ఇంటర్మీడియోట్ 95 శాతం మెరిట్‌తో పాసయ్యాను. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్మితా సభర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్‌గా ఉండేవారు. పరిపాలనలో మేడమ్ డైనమిజం చూసి చాలా ఆకర్షితురాలినయ్యాను. నేను కూడా కలెక్టర్ కావాలనుకునేంతగా స్ఫూర్తి పొందాను. అందుకే ఐఏఎస్ అకాడమీలో చేరి మూడేళ్ల డిగ్రీ పూర్తి చేశాను. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి స్టేట్ ఫస్ట్‌లో మెరిట్ సాధించాను. ఉద్యోగంలో చేరేనాటికి 21 ఏండ్ల 10 నెలల వయసు. చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగంలో చేరిపోయానని ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద ప్రాజñ క్ట్ను మానిటర్ చేసే హోదాలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ఆగిపోకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. సాధించగలననే నమ్మకం ఉంది’ అని తెలిపింది.
ఇక్కడ అసలైన వ్యక్తిని పరిచయం చేసుకోవాల్సి ఉంది. తల్లీ కూతుళ్లుగా తాము సాధించిన విజయాల వెనుక రౌతు రమేష్ పాత్ర కీలకమైంది. పద్మ భర్త రమేశ్ సింగరేణి కాలనీలో చిరుద్యోగి. పెద్ద కుటుంబంలో చిన్నవాడు. అయితేనేం అర్థాంగి మనస్తత్వాన్ని, ఆమె అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చదువుకోవాలని ప్రోత్సహించారు.
కష్టపడి చదువుకోవడం ద్వారా కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్లొచ్చు అని ఈ తల్లి కూతుర్లు నిరూపించారు. మన తెలంగాణ ఆడపడుచులైన ఈ ఇద్దరు విజయ గాధ ఈ తరం యువతకు ఆదర్శనీయం.