మీరు రోడ్డుపై ప్రయాణించడానికి గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తున్నారా? అయితే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. ఎట్టకేలకు స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను ఇండియాకు తీసుకొచ్చింది గూగుల్. బుధవారం సెర్చ్ ఇంజన్ దిగ్గజం స్ట్రీట్ వ్యూ ఆప్షన్ ను భారతదేశంలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. అతిత్వరలోనే హైదరాబాద్‌తో పాటు దేశంలోని మరో 8 నగరాల్లో అందుబాటులోకి రానుంది. స్ట్రీట్ వ్యూ ఫీచర్ వినియోగదారులకు నగరంలోని రోడ్లు, పబ్లిక్ భవనాల 360 డిగ్రీల వ్యూ ను పొందడంలో సహాయపడుతుంది. ఈ ఫీచర్ వస్తే.. ఇంట్లో కూర్చొనే నగరంలోని ఏ ప్రాంతాన్నయినా రియలస్టిక్ గా చూడవచ్చు. ల్యాండ్‌మార్క్‌లను సులభంగా గుర్తుపట్టవచ్చు. వెళ్లాలనుకున్న గమ్యానికి మరింత సులువుగా చేరుకోవచ్చు. ఒక ఈవెంట్ సందర్భంగా.. జెనెసిస్ సహా టెక్ మహీంద్రా సహకారంతో స్ట్రీట్ వ్యూ సేవను ప్రవేశపెట్టినట్లు గూగుల్ ప్రకటించింది.
ఈ ఫీచర్ 1.50 లక్షల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే పది భారతీయ నగరాలకు అందుబాటులో వచ్చింది. మొదటగా బెంగళూరు నగరంలో ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టారు. బెంగళూరు తర్వాత మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి వచ్చేది హైదరాబాద్‌లోనే. ఆ తర్వాత కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణె, నాసిక్, వడోదరా, అహ్మద్‌నగర్, అమృత్సర్ నగరాలకు కూడా వస్తుంది. ఈ పదింటితో పాటు ఈ ఏడాది చివరికల్లా దేశంలోని 50కు పైగా నగరాల్లో స్ట్రీట్ వ్యూ సదుపాయాన్ని తీసుకురావాలని గూగుల్ నిర్ణయించుకుంది.