కేంద్ర ప్రభుత్వము మహిళలకు ఒక తీపి కబురు అందిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తారంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇది దేశమంతటికి వర్తించేదే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ఇందుకోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారు. గత ఎన్నికల ముందు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ఎన్నికల కోడ్ రావడంతో పధకం అమలను నిలిపివేశారు.
ఈ పార్లమెంటు సమావేశాలలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఈ విషయం మీద కేంద్రాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు పచ్చ జెండా ఊపినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వివిధ వృత్తుల వారికి యంత్రాలు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆర్థికసాయం అందిస్తుంది. మహిళలకు కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు విశ్వకర్మ పథకంలో ఆర్థికసాయం అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో అనేకమంది మహిళలకు ప్రయోజనం కలగబోతోంది.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కుట్టుమిషన్ కొనుక్కునేందుకు రూ .15,000 అందిస్తారు. ఈ నగదును లబ్దిదారుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తుంది. దీంతో పాటు ఒక వారం శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తారు. కుట్టుమిషన్ కొనుగోలు తర్వాత అతి తక్కువ వడ్డీకి రూ.లక్ష రుణం అందిస్తారు.
ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెలిస్తే, మరో రూ .2 లక్షల వరకు రుణం పొందవచ్చు. దానిని 30 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కుట్టు మిషన్ కొనుక్కునే వారు షాప్ పెట్టుకోవడానికి కూడా కేంద్రం రుణం ఇస్తుంది. గతంలో కుట్టుమిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
అర్హతలు కూడా సరళంగా నిర్ణయించారు. ఉచిత కుట్టుమిషన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్లు భారతీయులై ఉండాలి. ఇప్పటికే కుట్టుపనిలో అనుభవం కలిగి ఉండాలి. వయసు 18 ఏళ్లు పైబడి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, అడ్రస్ వివరాలు, గుర్తింపు కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు బ్యాంకు పాస్ బుక్, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.
చాలా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తున్నారు. ముందుగా https://pmvishwakarma.gov.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయాలి. మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తెలియకపోతే దగ్గరలోని మీసేవ కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ పూర్తైన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత శిక్షణకు పిలుస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వం మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తుంది. ఆ నగదుతో మీరు కుట్టు మిషన్ కొనుగోలు చేయవచ్చు. అనంతరం బ్యాంక్ మీకు లోన్ సదుపాయం కల్పిస్తుంది. అతి తక్కువ వడ్డీకి రూ.3 లక్షల వరకు పీఎం విశ్వకర్మ పథకంలో లోన్ పొందవచ్చు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మహిళలకు ఈ నిధులు విడుదల అయినట్లు తెలుస్తోంది. గతంలో కూడా డ్వాక్రా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల మహిళలు పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. మహిళా సాధికారతను ప్రత్యక్షంగా అమలు చేసి చూపించారు.