ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి శుభవార్త అందుతోంది. అక్కడ రాజధాని భవనాల నిర్మాణానికి 15 రూపాయల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని నీ ప్రపంచస్థాయి నగరంగా చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తగినట్లుగా నాణ్యమైన మౌలిక వసతులు అద్భుతమైన కట్టడాలు అదిరిపోయే రోడ్లతో రాజధానిని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాజెక్టు రిపోర్టు మీద ప్రాథమికంగా ప్రపంచ బ్యాంకు అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు చెందిన ప్రతినిధుల బృందం ఆగస్టు 19 నుంచి 27 వరకు రాజధానిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రుణ మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులతో చర్చిస్తున్నారు.
ఇటీవల అమరావతిలో పర్యటించిన నలుగురు సభ్యుల ప్రపంచ బ్యాంకు బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపింది.
వాస్తవానికి 2019కి ముందే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్దమైంది. ఏఐఐబీతో కలిసి తొలి విడతలో రూ.3,500 కోట్లు రుణం ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన ప్రక్రియ సైతం పూర్తయ్యింది. అయితే ఇంతలో ప్రభుత్వం మారడం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రుణం పట్ల అనాసక్తి వ్యక్తం చేయడంతో కార్యరూపం దాల్చలేదు.
ఇప్పటికే పక్రియ పూర్తవడంతో సత్వరం రుణం మంజూరుకు ప్రపంచ బ్యాంకు, ఏడిబిలకు అవకాశం ఏర్పడుతుంది. రాజధానిలో ప్రాజెక్టుల వారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతామన్నది ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధుల బృందం నిర్ణయించనుంది.
దీంతో ఆ బృందానికి సవివర నివేదికలను అందించేందుకు సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ కొద్ది రోజులుగా వివిధ శాఖల అధికారులతో కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఎన్జీఓ, సెక్రటరీలు, జడ్జీల భవనాలు, ప్రభుత్వ టైప్ – 1, టైప్ – 2 భవనాలు, ఎల్పీఎస్ ఇన్ర్ఫా, ట్రంక్ ఇన్ర్ఫా, రాజధాని వంటి భవనాలను నిర్మించబోతున్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి బలమైన హామీ లభించింది. దీనికి తోడు ప్రపంచ బ్యాంకు రుణాలు కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే అమరావతి రాజధాని నిర్మాణం అద్భుతంగా రూపొందడం ఖాయం గా తెలుస్తోంది.