ప్రముఖ హీరో చిరంజీవికి దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా ప్రకటించింది . ఇప్పటికే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ వీసా వచ్చింది. తాజాగా తెలుగు హీరో చిరంజీవికి గోల్డెన్ వీసాను ప్రకటించారు. దీని మీద స్పందిస్తూ..ఈ గోల్డెన్ వీసా ఇచ్చినందుకు గాను దుబాయ్ ప్రభుత్వానికి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రస్తుత సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ అన్నది బంగారం మార్కెట్ కు పెట్టింది పేరు. అక్కడ నుంచి పెద్ద ఎత్తున బంగారం తెచ్చుకునేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. అందుచేత గోల్డెన్ వీసా అనగానే సోషల్ మీడియాలో కామెంట్స్ అందుకున్నాయి. చిరంజీవి పేరు చెప్పి బంగారం తెచ్చేసుకోవచ్చా అంటూ కామెంట్లు పడుతున్నాయి.
నిజానికి గోల్డెన్ వీసాకు, బంగారం దిగుమతికి ఏమాత్రం సంబంధం లేదు.
ఇతర దేశాల్లోని ప్రముఖులకు గోల్డెన్ వీసా ఇవ్వడం దుబాయ్ ప్రభుత్వం ఆనవాయితీ. దీని కారణంగా దుబాయ్ కు ఆయా దేశాలతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ గోల్డెన్ వీసా కింద కొన్ని ప్రయోజనాలు కల్పిస్తారు . 10 సంవత్సరాలకు పైబడి దుబాయిలో నివసించే అవకాశం కల్పిస్తారు. కొన్ని నిబంధనలకు లోబడి అక్కడ ఆస్తుల్ని కొనుగోలు చేసి ఉంచుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా వీసాకు అవసరమయ్యే స్పాన్సర్ నిబంధన ఇక్కడ అవసరం ఉండదు. అంతేకాకుండా దుబాయిలో కుటుంబ సభ్యుల్ని, ఇంటికి సంబంధించిన పని వారిని కూడా తీసుకుని వెళ్లి అక్కడ ఉంచుకోవచ్చు .దుబాయిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు తేలికగా అనుమతులు ఇస్తారు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అంతేకాకుండా అనేకసార్లు దుబాయ్ వచ్చి పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇకనుంచి చిరంజీవికి కూడా ఈ అవకాశాలన్నీ కల్పిస్తారు.
మొత్తం మీద దుబాయిలో ఉండటానికి వ్యాపారాలు చేసుకునేందుకు ఈ గోల్డెన్ వీసా బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో ముంబాయికి చెందిన బడా బాబులు, ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలుపెట్టారు. అటువంటి వ్యాపారులు ఈ గోల్డెన్ వీసా కోసం తహతహలాడుతున్నారు. కానీ భారత్ లోని సినీ దిగ్గజాలు అయిన రజినీకాంత్, చిరంజీవి వంటి వారికి దుబాయ్ ప్రభుత్వమే ముందుకు వచ్చి గౌరవ సూచకంగా అందించింది. ఈ గోల్డెన్ వీసా సహాయంతో ఈ ప్రముఖులు అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశిస్తే మాత్రం భారీగా లాభాలు సంపాదించవచ్చు.
మొత్తం మీద చిరంజీవి గోల్డెన్ వీసా టాపిక్ .. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.