వారణాశిలోని జ్ఞానవాపి ప్రాంగణంలో కనిపించిన శివలింగం వయసును నిర్థారణకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలను జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంలో సవాల్ చేసింది.
దానిపై శుక్రవారం విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించింది. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రాఫిక్ సర్వేలో ఈ శివలింగం బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఇది శివలింగం కాదని, ఫౌంటెన్ అని ముస్లింలు వాదిస్తున్నారు.
ఈ పిటిషన్ను త్వరగా విచారించాలని జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ తరపున సీనియర్ అడ్వకేట్ హుజెఫా అహ్మది ధర్మాసనాన్ని కోరారు. అపీలు పెండింగ్లో ఉండగా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, తీర్పు రిజర్వు అయి, పెండింగ్లో ఉన్నపుడు కార్బన్ డేటింగ్ కోసం మరో దరఖాస్తు దాఖలు చేశారని చెప్పారు. అసలైతే సోమవారం విచారణ జరుపుతామని సీజేఐ చెప్పారు. అయితే అదే రోజు సైంటిఫిక్ సర్వే ఉందని అడ్వొకేట్ చెప్పడంతో మే 19 శుక్రవారంనాడు విచారణ జరుపుతామన్నారు.
అంతకుముందు హిందూ పక్షం అలహాబాద్ హైకోర్టు తీర్పుపై కెవియట్ దాఖలు చేసింది. హైకోర్టు మే 12న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లపై తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలివ్వొద్దని కోరింది.
లక్ష్మీ దేవి, మరి కొందరు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు మే 12న ఆదేశాలు జారీ చేసింది. మే 22న వారణాసి జిల్లా కోర్టులో హాజరుకావాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అలాగే శివలింగం వయసును శాస్త్రీయంగా నిర్థారించేందుకు కార్బన్ డేటింగ్ కూడా నిర్వహించాలంది.