జ్ఞానవాపి మసీదు విశ్వనాథమందిరంలో భాగమని అందులో సందేహమే లేదని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే స్పష్టం చేశారు. పురాణాల(వేద సాహిత్యం) ప్రకారం వారణాసిలోని జ్ఞానవాపి మసీదుఉన్న స్థలం ఆలయానిదేనని అన్నారు. హిందువులలో ఉన్న నమ్మకం, అలాగే పురాణాలలో లిఖించిన వాటిని…. తాజాగా బయటపడిన శివలింగం రుజువు చేస్తుందన్నారు.
జ్ఞానవాపి మసీదు ఉన్నచోట జ్యోతిర్లింగం ఉందని పురాణాలలో స్పష్టంగా ఉందని పాండే చెప్పారు. మసీదు నిజానికి ముందు దేవాలయమేని, కనిపిస్తున్న శిథిలాలు కూడా ఆలయంలో ఒక భాగమని అన్నారు. మసీదున్న ప్రాంతంలోనే జ్యోతిర్లింగం ఉందన్నది తన వాదన మాత్రమేకాక, యావత్ హిందూసమాజం విశ్వాసంఅని ..అదిప్పుడు రుజువు అయినట్టేననీ పాండే అన్నారు.
ఔరంగజేబు శివుని ఆలయాన్ని పడగొట్టి జ్ఞానవాపి మసీదును నిర్మించాడని హిందువుల వాదన. చరిత్రకూడా అదే చెబుతోంది. జ్ఞానవాపి మసీదు-శృంగార్ గౌరీ కాంప్లెక్స్ ఐకానిక్ కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉంటుంది.
వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు సముదాయంలో కోర్టు పర్యవేక్షణలో వీడియోగ్రఫీ సర్వే సోమవారం ముగిసింది. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవికుమార్ దివాకర్ మసీదు సర్వేను ఆదేశించారు, పర్యవేక్షించడానికి ముగ్గురు కమీషనర్లను నియమించారు.
సర్వే పూర్తయిన తర్వాత హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సర్వే సమయంలో అక్కడ శివలింగం కనిపించిందని, జ్ఞానవాపి మసీదు సముదాయంలోని చెరువు(వజూఖానా)కి సీలు వేయాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు.