వారణాశిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం చేశారు భారత ప్రధాని మోదీ. రోజంతా ఆయన కాశీలోనే గడిపారు. ఉదయం వారణాశి చేరుకున్న ఆయనకు సీఎం యోగి, సహా పలువురు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా కాశీకి చేరుకున్నారు. దారి పొడవునా స్థానికులు ఆయనకు ఘననీరాజనం పలుకుతూ ఆహ్వానించారు. ముందుగా కాలభైరవుడిని దర్శించుకున్నారు. తరువాత గంగానదిలో పూజలు చేసి, పుణ్యస్నానాలు చేశారు. అక్కడే నౌకలో నదీ విహారం చేస్తూ కాశీపురిని పరిశీలించారు. ఆ తరువాత విశ్వనాథ మందిరం చేరుకుని పూజలు చేశారు.
పురాతన నగరంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున పెంచే ఉద్దేశంతో మెగా ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. ఆలయ పునర్మిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేశారు. గేట్వేలు, ఇతర నిర్మాణాలు సాంప్రదాయ హస్తకళను ఉపయోగించి రాళ్ళు, ఇతర వస్తువులతో నిర్మించారు. మొత్తంగా కాశీ రూపురేఖలే మారిపోయాయని చెప్పవచ్చు.
పవిత్ర గంగా నదిలో స్నానం చేసి, ఆ నీటితోనే స్వామికి అభిషేకం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం, విశ్వాసం.
ఇరుకైన వీధులు, పరిశుభ్రంగా లేని పరిసరాలతో భక్తులు ఇబ్బంది పడుతుండేవారు. ఇప్పుడు గంగా నుంచి నేరుగా గర్భగుడికి వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఈ కారిడార్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మోదీ. కరోనావల్ల నేరుగా పనుల్ని పర్యవేక్షించలేకపోయిన ఆయన…ప్రాజెక్ట్ మినియేచర్ పెట్టుకుని వీడియోకాన్ఫరెన్సుల ద్వారా సమీక్షించారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులతో విశ్వనాథాలయానికి కొత్త కళ వచ్చింది. ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఒకేసారి 50,000 నుండి 75,000 మంది వరకు ఉండవచ్చు. రోజుకు 2 లక్షల మందిభక్తులు వారణాశి సందర్శిస్తారని అంచనా.
అత్యంతవైభవంగా జరిగిన విశ్వనాథ థామ్ ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచీ 3 వేల మంది సాధువులు హాజరయ్యారు. సాయంత్రం నౌకలోనే వివిధ రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశమయ్యారు. వారణాశి ఎంపీ కూడా అయిన మోదీ… కాశీ వైభవాన్ని వారికి వివరించారు.క్రూయిజ్ నుంచే గంగా హారతిని, ఘాట్లపై ఉత్సవాలను తిలకించారు. లేజర్ షో తో వేడుకలు ముగిశాయి. ఘాట్లపై ఐదు లక్షల దీపాలను వలిగించి, ఈ సందర్భంగా ‘దేవ్ దీపావళి’గా నిర్వహించారు.
వేడుక ముగిసిన తరువాత మోదీ డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ క్యాంపస్‌లోని అతిథి గృహంలో బసచేశారు. రేపు మరోసారి ముఖ్యమంత్రులతో అధికారిక సమావేశంలో పాల్గొంటారని..అలాగే ఉమ్రాహాలోని సర్వేద్ మందిర్ వార్షిక వేడుకకు హాజరవుతారని సమాచారం.