భారతదేశంలోనే పేరెన్నిక గన్న ఆధ్యాత్మిక వ్యవస్థగా కంచి కామకోటి పీఠము ను చెప్పవచ్చు. భగవాన్ ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ కంచిపీఠంకు హైందవ ఆధ్యాత్మిక పరంపరలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. నడిచే దైవంగా చెప్పుకునే చంద్రశేఖర సరస్వతి నాయకత్వంలో ఈ పేరు ప్రతిష్టలు మరింత పెరిగాయి.
ప్రస్తుతం కంచి పీఠాధిపతిగా విజయంద్ర సరస్వతి మహా స్వామి ఉన్నారు. ఆయన కూడా తెలుగు నేల నుంచి తమిళ నాడు వెళ్ళారు. ఇప్పుడు ఆయన వారసునిగా మరో తెలుగు అబ్బాయిని ఎంపిక చేశారు. ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా ఆయనకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో సన్యాస దీక్ష ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన గణేశశర్మ… 1998లో దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తిపేరు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రావిడ్. ఆయన తండ్రి అన్నవరం ఆలయంలో మూడు దశాబ్దాలుగా ప్రధమ శ్రేణి వ్రత పురోహితుడిగా ఉన్నారు. గణేశశర్మ తన ఆరో ఏటనే రత్నాకర భట్టు వద్ద రుగ్వేదం అభ్యసించి నిష్ణాతులయ్యారు. 2006లో వేద్య అధ్యయన దీక్ష తీసుకున్నారు. ద్వారకా తిరుమల ఆలయంలో వేదవిద్యను అభ్యసించారు. అనంతరం తెలంగాణలోని బాసర జ్ఞానసరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేదపాఠశాలలో సేవలందించారు. ఆ సమయంలో బాసర పర్యటనకు వచ్చిన విజయేంద్ర సరస్వతి ఆయనను శంకర మఠానికి తీసుకెళ్లారు. అక్కడ తర్కం, మీమాంసతో పాటు సామవేదం, యజుర్వేదంలో స్వామీజీ స్వయంగా శిక్షణ ఇచ్చారు.
పూర్తిస్థాయిలో వేద వేదాంగాలు ఆధ్యాత్మిక శాస్త్రాలు అభ్యసించడంతో ఉత్తరాధికారిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కాలంలో కంచి కామకోటి పీఠంతో పాటుగా పీఠం ఆధ్వర్యంలోని దేవాలయ వ్యవస్థలో విద్యాలయాలు వైద్యాలయాలు సామాజిక కార్యకలాపాలకు ఆయన నాయకత్వం వహిస్తారు.