అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశమంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. అహింసా విధానంలో స్వాతంత్ర్యం తీసుకుని వచ్చి చరిత్రలో భారత్ పేరును చిరస్మరణీయంగా నిలిపారు.
అయితే గాంధీజీ హత్య మీద కొన్ని స్వార్థ శక్తులు మాత్రం ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాయి. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ తో ముడిపెట్టి ప్రచారాలు చేస్తూనే ఉన్నాయి. సమయం సందర్భం దొరికినప్పుడల్లా సంఘ్ మీద బురద జల్లుతూనే ఉన్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో బలంగా పోరాడిన వ్యక్తులలో స్వయంసేవక్ ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అదే సమయంలో గాంధీజీని కూడా అప్పటి సంఘ్ పెద్దలు బాగా గౌరవించేవారు. గాంధీ హత్య జరిగి.. ఆ సమాచారం బయటకు వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాధవరావు సదాశివ గోళ్వాల్కర్ చెన్నైలో (అప్పటి మదరాసు నగరం) ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొంటున్నారు. నగరంలోని ప్రముఖ వ్యక్తులు చాలామంది ఆ సభకు హాజరయ్యారు. ఆ సభలో పాల్గొన్న ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల మేరకు, గోళ్వాల్కర్ అప్పుడే తేనీరు సేవించబోతుండగా గాంధీ మరణవార్త ఎవరో వెల్లడించారు. వెంటనే ఆయన తన చేతిలోని కప్పును కింద పెట్టేసారు. గాద్గదిక స్వరంతో ‘‘దేశానికి ఇదెంతో దురదృష్టకరం’’ అన్నారు.
సన్నిహితులు సమక్షంలో ఆయన చాలా బాధపడ్డారు. అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవాహర్లాల్ నెహ్రూ, కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ కుమారుడు దేవదాస్ గాంధీలకు టెలిగ్రామ్ ద్వారా సంతాపసందేశాలు పంపించారు.తర్వాత గోళ్వాల్కర్ తన దేశవ్యాప్త పర్యటనను రద్దు చేసుకుని నాగపూర్‌లోని సంఘ కేంద్రకార్యాలయానికి చేరుకున్నారు.
అప్పుడే ఆర్ఎస్ఎస్ తరఫున చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు.గాంధీ మృతికి సంతాపసూచకంగా ఆర్ఎస్ఎస్ శాఖలు అన్నింటినీ 13 రోజుల పాటు మూసివేయమని ఆదేశించారు. సంఘ చరిత్రలో అన్నినాళ్ళు శాఖ జరగకుండా నిలిచిపోవడం అదే మొదటిసారి. 1925లో సంస్థ స్థాపించిన నాటినుంచీ సంవత్సరంలో 365 రోజులూ శాఖలు జరుగుతూనే ఉన్నాయి. అది సంస్థ విధించుకున్న స్వీయ నియమం. అయితే మహాత్ముడి మరణం ఒక్క సందర్భంలో మాత్రమే శాఖల నిర్వహణకు మినహాయింపు ఇచ్చారు. గాంధీజీ అంటే ఆర్ఎస్ఎస్కు ఉన్న గౌరవానికి నిదర్శనం అది.
ఆ తర్వాత దీని మీద సంఘ్ తరఫున అధికారికంగా స్పందించారు.
గోళ్వాల్కర్ నాగపూర్ చేరుకున్నాక పండిట్ నెహ్రూకు లేఖ రాసారు. ‘‘దేశానికి చుక్కాని వంటి వ్యక్తి మీద దాడి జరిగింది. విభిన్న స్వభావాలు కలిగిన వారందరినీ ఒక దారంలా కలిపి ఉంచి, అందరినీ సరైన దారిలో పెడుతున్న అలాంటి వ్యక్తి మీద దాడి చేయడమంటే ఆ వ్యక్తికి మాత్రమే కాక దేశం మొత్తానికీ ద్రోహం చేయడమే. అలాంటి ద్రోహానికి పాల్పడిన వ్యక్తి మీద మీరు, అంటే ప్రభుత్వ అధికారులు, కఠినమైన చర్య తీసుకుంటారు అనడంలో సందేహమే లేదు. కానీ ఇది మనందరికీ పరీక్షా సమయం. ఈ కష్టకాలంలో దేశాన్ని సురక్షితంగా ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది.’’
ఆర్ఎస్ఎస్ చీఫ్ అప్పటి ఉపప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాసిన లేఖలో ‘‘అందరినీ కలిపి ఉంచే గొప్ప వ్యక్తి అకాల మరణం కారణంగా పడిన బాధ్యతను మనందరం పంచుకుందాం. వేర్వేరు లక్షణాలు కలిగిన మనందరినీ ఒక బంధంతో దగ్గరకు తీసుకొచ్చి, అందరినీ ఒకే బాటలో నడుపుతూ వచ్చిన ఆ మహానుభావుడి పవిత్ర జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవాలి. ఈ కష్టకాలంలో మనందరం మన భావాలను అదుపు చేసుకోవాలి, మన శక్తిని కాపాడుకోవాలి. జాతి జీవితాన్ని ఐకమత్యంతో బలోపేతం చేసుకోవాలి’’ అని రాసుకొచ్చారు.
ఈ సంఘటనకు సంబంధించి ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తూ వచ్చింది. ప్రభుత్వం మాత్రం మరోలా స్పందించింది. 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్ను నిషేధించింది. గోళ్వాల్కర్‌ను అరెస్ట్ చేసారు. దురదృష్టం ఏంటంటే గోళ్వాల్కర్‌ను అరెస్ట్ చేయడానికి బెంగాల్ స్టేట్ ప్రిజనర్స్ యాక్ట్ అనే చట్టాన్ని ప్రయోగించారు. అదే చట్టాన్ని నల్లచట్టం అంటూ నెహ్రూ అంతకంటె చాలాముందే విమర్శించాడు. గోళ్వాల్కర్‌ను ఆరు నెలల తర్వాత విడుదల చేసారు, కానీ మరికొన్నాళ్ళకే మళ్ళీ అరెస్ట్ చేసారు. దాంతో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు సత్యాగ్రహం చేసారు. 77వేలమందికి పైగా స్వయంసేవకులు అరెస్ట్ అయ్యారు. అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం సంఘానికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమైనా చూపలేకపోయింది.
ఇక్కడే మరో విషయం కూడా తెలుసుకోవాలి. గాంధీ హత్య జరిగిన నెల రోజుల తర్వాత సర్దార్ పటేల్ ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూకు లేఖ రాసారు. ‘‘బాపూ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతిని నేను వ్యక్తిగతంగా నేనే ప్రతీరోజూ పర్యవేక్షిస్తున్నాను. ప్రధాన నిందితులు అందరూ తమ కార్యకలాపాల గురించి సుదీర్ఘమైన, సవివరమైన ప్రకటనలు ఇస్తున్నారు. వాటిని బట్టి ఈ కేసులో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి ప్రమేయమూ లేదని స్పష్టంగా తెలుస్తోంది’’ అని ఆ లేఖలో రాసారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ గోళ్వాల్కర్‌కు రాసిన ప్రతిలేఖలో కేంద్ర ఉపప్రధానమంత్రి సర్దార్ పటేల్ ఇలా చెప్పారు. ‘‘సంఘం మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో నేను ఎంత సంతోషంగా ఉన్నానో కేవలం నా దగ్గరున్న కొద్దిమందికి మాత్రమే తెలుసు’’ అంటూ రాసుకొచ్చారు.
సాంకేతిక అంశాల పరిష్కారం తర్వాత సంఘం మీద నిషేధం 1949 జూన్ 12న తొలగించారు. అయినప్పటికీ సంఘ్ విద్వేషులు గాంధీ హత్యలో సంఘం పాత్ర ఉందంటూ దుష్ప్రచారాన్ని ఆపలేదు.
ఇప్పటికీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా సంఘ్ మీద స్వార్థపూరిత శక్తులు బురద జల్లుతూనే ఉన్నాయి.