కరోనా కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియెంట్ కు XBB.1.16 అని పేరు పెట్టారు. ఈ స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఎదురుపడి మాట్లాడుతున్నా తుంపర్లతోనే వ్యాపిస్తోంది. కరోనా తొలి రోజులు గుర్తు తెచ్చేలా ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కోవిడ్ ఇక తగ్గుముఖం పట్టినట్టేనని జనం మాస్కులు వేసుకోవడం కూడా మానేశారు. భౌతిక దూరం పాటించడం లేదు. అప్రమత్తంగా ఉండకపోవడం కూడా కరోనా విజృంభణకు కారణమని చెబుతున్నారు. కరోనాలో ఇప్పటికే ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ వంటి అనేక రకాల వేరియెంట్లు వచ్చాయి.
సెకండ్ వేవ్ లో వచ్చిన డెల్టా వేరియంట్ ఎంతోమందిని పొట్టనపెట్టుకుంది. అందులోనూ 200 సబ్ వేరియంట్లు బయటపడ్డాయి. BA.2.10.1 and BA.2.75 నుంచి కొత్తగా XBB.1.16 పుట్టుకొచ్చిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటోంది. ఈ సీక్వెన్స్ ను జనవరి 23న డాక్యుమెంట్ చేశారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియెంట్ పై దృష్టిపెట్టిన WHO అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. BA.2.10.1 అలాగే BA.2.75 అన్నవి ఒమిక్రాన్ సబ్ వేరియంట్లుగా చెబుతున్నారు. ఈ వేరియంట్ కూడా చైనాలో కల్లోలానికి కారణమైంది. XBB.1.16 వేరియంట్ తో అలర్ట్ గా ఉండాలని మెడికల్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
మహారాష్ట్రలో జెనోమిక్ సీక్వెన్సింగ్ ఆధారంగా ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 నమూనాలపై ఫోకస్ పెట్టారు. నాగ్‌పూర్‌లోని 75% శాంపిల్స్ లో ఇదే వేరియంట్ కనిపించిందని చెబుతున్నారు. అలాగే ముంబైలో 42%, పూణేలో 93%, అమరావతిలో 42%, అకోలాలో 27% నమూనాల్లో XBB.1.16 ని గుర్తించారు. గుజరాత్లో ఇది దాదాపు 60% శాంపిల్స్‌లో ఇదే వేరియంట్ ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ స్ట్రెయిన్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో ఈ శాంపిల్స్ చూస్తే అర్థమవుతుంది. వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న 5 రాష్ట్రాల్లో…నిత్యం పదివేలకు పైగా టెస్టులు చేస్తున్నారు.
జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే కనుక అశ్రద్ధ చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలో ఒకవైపు H3N2 ఇన్ ఫ్లూయెంజాతో పాటు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గతేడాది అక్టోబర్ లో నమోదైన కేసుల తీవ్రత మళ్లీ ఇప్పుడు కనిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు 95 శాతం జనాభాకు ఇన్ఫెక్ట్ అయిందంటున్నారు. ఇప్పుడు దాని సబ్ వేరియంట్ అయిన XBB.1.16 రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఆందోళనైతే అంతటా వ్యక్తం అవుతోంది.