
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు దుర్మరణం చెందారు. రాజౌరీ సెక్టార్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. అక్కడ ఉగ్రవాదుల కదలికలపై సైన్యానికి సమాచారం అందడంతో ఆర్మీ కూంబింగ్ నిర్వహించింది. కంది అటవీ ప్రాంతంలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులు కొందరు ఆర్మీ సెర్చ్ టీం కంటబడ్డారు. జవాన్లను చూడగానే ఉగ్రవాదులు వారిపైకి హ్యాండ్ గ్రనేడ్లు విసిరారు. తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఉధంపూర్లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు మధ్యాహ్నం వరకూ కొనసాగాయి. గత నెలలో అదే ప్రాంతంలో భారతజవాన్లను తరలిస్తున్న ఆర్మీ వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చినసంగతి తెలిసిందే. నాటి ఘటనలోనూ ఐదుగురు సైనికులు అమరులయ్యారు.